Ap Politics: కేంద్రంలోని మోడీ సర్కార్ దీపావళి పండుగ సందర్భంగా ఓ ఫైన్ మార్నింగ్ దేశంలో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేసింది. రాష్ట్రాలు తగ్గించాలని.. వ్యాట్ ను తగ్గించుకోవాలని సూచించాయి. కేంద్రం క్రెడిట్ కొట్టేసి నెపాన్ని రాష్ట్రాలపై నెట్టేసింది.
అయితే ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు మాత్రం కేంద్రం వరమిచ్చినా తాము మాత్రం తగ్గించే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసలు తగ్గింపు అనే ముచ్చటనే లేదు. ఈ క్రమంలోనే దీన్ని సదావకాశంగా మలుచుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామన్న జగన్ ఇప్పుడు కేంద్రం తగ్గించినా తగ్గించట్లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని.. ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని తెలిపారు. పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఎంత ఆందోళన చేశాడో చెప్పుకొచ్చాడు. జగన్ ది తుగ్గక్ పాలన అంటూ ఆడిపోసుకున్నారు.
నిజానికి ఏపీ కరోనా దెబ్బకు కుదేలైంది. దీంతో కేంద్రం ధరలు తగ్గించినా కూడా ఆ ఆర్థిక భారం మోయలేక తగ్గించేయోచనే పెట్టుకోవడం లేదు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటోంది. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించేవరకూ టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు ప్రకటించడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఇరుకునపడింది. మరి ఈ సమస్యనుంచి జగన్ సర్కార్ ఎలా బయటపడుతుందనేది వేచిచూడాలి.