https://oktelugu.com/

KBR Park: మంత్రీ’ కోసం ముఖ్యమైన మంత్రి మంత్రాంగం.. కేబీఆర్ పార్క్ చుట్టూ విధ్వంసం

KBR Park: హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ అయినప్పటికీ.. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చిన్నపాటి అరణ్యాన్ని తలపించేది. నగర జీవుల కోసం అప్పటి ప్రభుత్వాలు ఆ పార్కును అభివృద్ధి చేశాయి. ఫలితంగా ఆ పార్క్ హైదరాబాద్ పాలిట అమెజాన్ అడవి అయింది. నగర జీవులకు తన వంతుగా ఆక్సిజన్ అందిస్తోంది. అంతేకాదు ఆ పార్క్ లో అటవీ పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాయి. ఆ పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీ అంతస్తులకు […]

Written By:
  • Rocky
  • , Updated On : April 15, 2023 / 12:15 PM IST
    Follow us on

    KBR Park

    KBR Park: హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ అయినప్పటికీ.. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చిన్నపాటి అరణ్యాన్ని తలపించేది. నగర జీవుల కోసం అప్పటి ప్రభుత్వాలు ఆ పార్కును అభివృద్ధి చేశాయి. ఫలితంగా ఆ పార్క్ హైదరాబాద్ పాలిట అమెజాన్ అడవి అయింది. నగర జీవులకు తన వంతుగా ఆక్సిజన్ అందిస్తోంది. అంతేకాదు ఆ పార్క్ లో అటవీ పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాయి. ఆ పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీ అంతస్తులకు అనుమతి ఇవ్వలేదు. జీవవైవిధ్య పరిరక్షణ కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఉమ్మడి పాలనలో ఎంతో వెలుగు వెలిగిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్.. తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అరుదైన జీవవైవిధ్యానికి నెలవైన ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఆనవాళ్లను క్రమంగా చేరిపేసుకుంటున్నది. ఇందుకు కారణం సొంత రాష్ట్రంలోని పాలకులే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    మంత్రి గ్రూప్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పరిధిలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సముదాయానికి సంబంధించి వెలువరించిన బ్రౌచర్

    తెలంగాణ కేబినెట్ లోని ఓ కీలకమైన మంత్రి తన ధన దాహంతో దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ దగ్గర అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తుండటమే పై ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా “మంత్రీ డెవలపర్స్‌కు అనే సంస్థకు 15 అంతస్తుల నిర్మాణాలకు అనుమతిచ్చారు. దీని వెనుక భారీ మతలబే జరిగిందని” పొలిటికల్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది. 2006లో పర్యాటకుల సౌకర్యం కోసం ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు అనుమతించింది. అప్పట్లో మూడు అంతస్తుల నిర్మాణం కోసమే అనుమతించింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ అంతస్తులకు అనుమతి ఇవ్వలేదు. 16 మంది ముఖ్యమంత్రులు కేబీఆర్‌ పార్క్‌ను కఠిన నిబంధనలు పెట్టి కాపాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా పార్క్‌ చుట్టూ నిర్మాణాలకు ఎన్నో షరతులు విధించింది.

    మంత్రీ కోసం కీలక మంత్రి మంత్రాంగం.. 15 అంతస్తులకు అనుమతి ఇచ్చారు

    2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేబీఆర్‌ పార్కు ప్రాంతంలో నిబంధనలను అనుసరించి 5 ఎకరాల 30 గుంటల భూమిని ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణం కోసం కేటాయించింది. ఐసీఐసీఐ వెంచర్స్‌, ఎన్‌సీసీ, మైటాస్‌ జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి సొంతం చేసుకున్నాయి. 2009లో సత్యం కుంభకోణం బయటపడటంతో మేటాస్‌ 15 శాతం వాటాను ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ అనే కంపెనీ కొనుగోలు చేసింది. తర్వాత కాలంలో ఐసీఐసీఐ, ఎన్‌సీసీ కూడా తప్పుకోవడంతో బెంగుళూర్‌ సంస్థ మంత్రీ డెవలపర్స్‌ చేతుల్లోకి ఈ భూమి వెళ్లింది. మంత్రీ డెవలపర్స్‌ 2012లో ఈ భూమిలో రెసిడెన్షియల్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకోగా, జీ+2కు అనుమతి వచ్చింది. అదనపు అంతస్తులకు అనుమతి కావాలని కోరినా పర్యావరణ కారణాలతో ప్రభుత్వం నిరాకరించింది. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత మంత్రీ డెవలపర్స్‌ తిరిగి అదనపు అంతస్తుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 2016 లో జీ+7 ఫ్లోర్లకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. 2018లో దానికి ఆమోదం లభించగా, 2021లో మరో ఐదు అంతస్తులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిది. దీనికి 2022లో కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతా సజావుగా కనిపిస్తున్నప్పటికీ ఈ అనుమతులకు తెరవెనుక చాలా పెద్ద బాగోతం జరిగింది.

    జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ అధునాతన సౌకర్యాలతో ఫ్లాట్లు నిర్మిస్తోంది. ఒక్కో భవనం లోపల ఎలా ఉంటుందో ఈ చిత్రంలో మనం చూడవచ్చు.

    మంత్రీ డెవలపర్స్‌తో ఒప్పందం కోసం 2017 మే 16న ఆర్‌ఎన్‌ఆర్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్పీ అనే కంపెనీ అవిర్భవించింది. వీర వెంకట రామారావు రేమెల్ల, శ్రీ కృష్ణ నాయక్‌ ఆ కంపెనీలో వాటాదారులు. రామారావు రేమెల్ల గతంలో సత్యంలో ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు.. ఇతను సత్యం కుటుంబానికి అత్యంత నమ్మకమైన, సన్నిహితుడు. వీళ్లు మంత్రి డెవలపర్స్‌లో భాగస్వాములు అయ్యాక వేగంగా అనుమతులు వచ్చాయి. ఆర్‌ఎన్‌ఆర్‌, మంత్రీ డెవలపర్స్‌ మధ్య ఒప్పందం జరిగిన తర్వాత ఫిబ్రవరి 21, 2018న ఉన్నపళంగా జీ+7 (2012లో ఇచ్చిన జీ ప్లస్‌ టుకు అదనంగా ఐదు ఫ్లోర్లు)కు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చేసింది. వాటితో సంతృప్తి చెందక మరో ఐదు ఫ్లోర్లకు దరఖాస్తు చేయగా, బేస్‌మెంట్‌లో మూడు, గ్రౌండ్‌, ఆ పైన మరో 11 ఫ్లోర్లు వెరసి మొత్తం 15 అంతస్తులకు అక్టోబర్‌ 13, 2022న జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చేసింది.

    మంత్రి గ్రూపులో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి “రియల్ ఎస్టేట్ గురు” అనే మ్యాగజిన్ లో వెలువడిన కథనం

    నిబంధనలు తుంగలో తొక్కారు

    ఈ ప్రాజెక్టులో ఒక్కో ప్లాట్ సగటున 8000 ఎస్‌ఎఎఫ్ టీతో నిర్మాణం చేపడుతున్నారు. ఇలా 200 ప్లాట్లు నిర్మిస్తున్నారు. సుమారు రూ.20 కోట్లు చేసే ఈ ప్లాట్ లకి ఇంటికి ఐదు కార్లు ఉంటాయి. వెయ్యి కార్లు ఉండే ఈ భవనంలో ఉదయాన్నే వందల కార్లు బయటకు వస్తే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సెంటర్‌ పరిస్థితి ఉంటుందో ఊహకే అందండం లేదు. కేబీఆర్‌ పార్క్‌ నుంచి 120 గజాల వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధన ఉంది. పార్కును ఆనుకుని ఏకంగా 15 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనిపై కేబీఆర్‌ పార్క్‌ దగ్గరకు వచ్చే వాకర్స్‌ అసోసియేషన్‌ ఈ అంశంపై ప్రజాప్రయోజన వాజ్యం వేసే యోచన లో ఉంది. అనుకోని ప్రమాదాలు జరిగితే భూమి లోపల ఉండే ఐదంతస్తుల నుంచి ఎవరైనా బయటకు వస్తారా? అంటే ఈ ప్రశ్న కు మంత్రీ డెవలపర్స్ వద్ద సమాధానం లేదు. తెలంగాణ కేబినెట్ లోని ముఖ్యమైన మంత్రి తన మిత్రుల కోసం, సత్యం రాజుల కోసం నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్‌ భవనాలను ధ్వంసం చేస్తున్నారని అసెంబ్లీలో చర్చ వచ్చినపుడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ను సీఎం కేసీఆర్ దబాయించారు. రాష్ట్రంలో ఏం జరిగినా తనకు తెలుస్తుందని చెప్పిన ఆయనకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సెంటర్లో జరిగే దోపిడీ కనిపించడం లేదా? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.