Petrol And Diesel Price: కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే గ్యాస్ బండ భారాన్ని కాస్త తగ్గించడంతో పండగ సీజన్‌లో పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలోనూ ఊరట లభించకపోదా అని వాహనదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ, సౌదీ అరేబియా, రష్యా ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. మన దేశంలో ధరలతో వాటికేం సంబంధం అనుకుంటున్నారా..? ప్రపంచ మార్కెట్‌కు ముడిచమురు రోజువారీ సరఫరాను పది లక్షల బ్యారళ్ల మేర తగ్గించాలన్న గత నిర్ణయాన్ని ఈ ఏడాది చివరికి వరకు పొడిగిస్తున్నట్లు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్యలోని ఆ రెండు కీలక దేశాలు ప్రకటించాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ కమోడిటీ ధరలు ఒక్కసారిగా ఎగబాకి 10 నెలల గరిష్ఠానికి తాకాయి. బ్రెంట్ రకం ముడి చమురు బ్యారల్ ధర 90 డాలర్లకు చేరువైంది. ఈ ఏడాదిలో బ్రెంట్ క్రూడ్ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. గడిచిన వారం రోజుల్లో దీని రేటు 6.5 శాతం మేర పెరిగింది. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ఇంధన విక్రయ కంపెనీలు మరింత వెచ్చించాల్సి వస్తుంది. భారత్‌లో 85 శాతం ఇంధన అవసరాలు దిగుమతుల ద్వారానే సమకూరుతాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపును అవరోధంగా మారినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, మే, జూన్‌లో భారత్ ముడి చమురు దిగుమతులకు ఒక్కో బ్యారల్‌పై వెచ్చించిన మొత్తం 73-75 డాలర్ల స్థాయిలో ఉండగా.. జూలైలో 80.37 డాలర్లు, ఆగస్టులో 86.43 డాలర్లకు చేరింది. ఈ నెలలో 89.81 డాలర్లకు ఎగబాకింది.
ఉత్పత్తి తగ్గించిన ఓపెక్ దేశాలు
మరోవైపు ఒపెక్ దేశాలు వ్యూహాత్మకంగా ఉత్పత్తిని తగ్గించాయి. వాస్తవానికి ఉక్రెయిన్_రష్యా యుద్ధం మొదలైనప్పుడు.. చమురు కొరత ఏర్పడుతుందని ఒపెక్ దేశాలు భావించాయి. అయితే భారత్ తెలివిగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఆ ముడి చమురు రవాణాకు రష్యా నౌకలను కూడా ఉచితంగా ఇచ్చింది. మరోవైపు చమురు అవసరాలకు ఒపెక్ దేశాల మీద ఆధారపడే అమెరికా.. రష్యా నుంచి చౌక ధరకు చమరు కొనుగోలు చేసి శుద్ధి చేస్తున్న భారత్ నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది.. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు డిమాండ్ తగ్గింది. ఇది అంతర్లీనంగా ఒపెక్ దేశాల ఆర్థిక వృద్ధి పై ప్రభావం చూపించింది.
ఇక రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐరోపా ఆంక్షలు మరింత పెరగడం.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పై అంతర్జాతీయంగా అరెస్టు వారెంట్ జారీ చేయడం.. రష్యా ఉత్పత్తి తగ్గించింది. ఇది అమెరికా అవసరాలపై తీవ్ర ప్రభావం చూపించడం ప్రారంభమైంది.. ఇదే అదునుగా ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం మొదలుపెట్టాయి. దీంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఒకసారిగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక మాంద్యం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. వల్ల అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు చమురు ధర పెరగడంతో పరిస్థితులు మరింత అదుపుతప్పే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మొన్న గ్యాస్ ధరలు తగ్గించిన భారత్.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ ధరలు కూడా తగ్గిస్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ముడి చమురు ధర పెరగడంతో ధరలు తగ్గే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే చమురు ధరల వల్ల దేశంలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ఇది బిజెపి విజయవకాశాలపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.