Power Cuts In AP: ఏపీలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా రోజు కనీసం మూడు గంటల పాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సరఫరాను నిలిపివేస్తున్నారు. మరోవైపు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు దీంతో వర్షాకాలంలో కరెంటు కోతలు ఏంటని ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
సాధారణంగా వేసవికాలంలో విద్యుత్ కోతలు ఉండడం సహజం. కానీ ఏపీలో మాత్రం వర్షాకాలంలో సైతం కరెంటు కోతలు విధిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోవడం, రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. కోతలు అనివార్యంగా మారాయి. అటు బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరకడం లేదని ప్రభుత్వం చెబుతోంది. కోతలు ఒకవైపు విధిస్తూనే.. విద్యుత్ చార్జీలు అమాంతం పెంచేశారు. దోపిడీకి పాల్పడుతున్నారు.
ఏపీలో కరెంట్ కోతలపై ఇతర రాష్ట్రాల్లో సెటైర్లు పడుతున్నాయి. సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉన్నామని చెబుతున్న ఏపీ పాలకులకు.. ప్రజలకు అవసరమైన కరెంటు ఇచ్చే స్తోమత లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు విపక్షాల సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు అయితే ఇటీవల పాపులర్ అయిన ఓ డైలాగ్ తో హోరెత్తించారు. ” కరెంట్ కోతలు లేని చోటు లేదు.. కరెంట్ బిల్లులపై తిట్టని నోరు లేదు.. అర్థమైందా సైకో జగన్ రెడ్డి” అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అటు నారా లోకేష్ సైతం పాదయాత్రలో విద్యుత్ కోతలపై విరుచుకుపడుతున్నారు. అయినా సరే ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఏపీకి పరిస్థితి దాపురించిందని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే వర్షాకాలంలో సైతం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి.