
Pegasus: పెగసస్ వ్యవహారంపై పార్లమెంట్ లో పెద్ద దుమారమే రేగింది. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని ప్రతిపక్షాలు గోల చేశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సైతం పెగసస్ పై అనుమానం వ్యక్తం చేసింది. వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కాకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కేంద్రం తన వైఖరి స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల్ని ఆదేశించడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.
పెగసస్ వ్యవహారంలో సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు పిటిషన్లు దాఖలు చేశారు. దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఫోన్లు తమ గుప్పిట్లో ఉంచేలా ట్యాపింగ్ చేయడం సమంజసం కాదని తెలిసినా ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. అయితే ప్రభుత్వం స్పైవేర్ తో వ్యక్తుల ఫోన్ల పై నిఘా ఏర్పాటు చేసిందా లేదా అనేది మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. కేంద్రం కూడా తన వైఖరి వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ప్రతిపక్షాల గోల వృథా అయిపోతోంది.
కేంద్రం మాత్రం ఆ సాఫ్ట్ వేర్ ఉపయోగించింది లేనిది బయటపెట్టడం లేదు. పెగసస్ స్పైవేర్ నిఘాపై ఎవరికి వారే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నా వాటిలో ఆధారాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరైన విధంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
ఒకవేళ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తే కేంద్రం సహకరిస్తుందన్న నమ్మకం మాత్రం లేకుండా పోతోంది. ప్రతిపక్షాలు తమ వంతు వాణి వినిపిస్తున్నా అసలు విషయం వెలుగు చూడడం లేదు. దీంతో కేంద్రం తన నిజాయతీని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మాత్రం విచారణకు ఒప్పుకోవడం లేదు.