Balakrishna : పేరుకే సీఎం జగన్ కానీ.. రాయలసీమలో పెత్తనమంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఎవరికైనా ముందరి కాళ్ళ బంధం వేయాలంటే జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రయోగిస్తారు. పెద్దిరెడ్డి తో చంద్రబాబుకు చెక్ చెప్పాలని భావించారు. అనుకున్నంత పని చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో క్లీన్ స్వీప్ దిశగా మలచడంలో పెద్దిరెడ్డి పాత్ర కీలకం. అప్పటి నుంచే వై నాట్ కుప్పం అన్న స్లోగన్ వైసీపీలో పెరిగింది. ఇప్పుడు అదే పెద్దిరెడ్డి హిందూపురం పై ఫోకస్ పెట్టడం విశేషం.
గత ఎన్నికల్లో రాయలసీమలో టిడిపి మూడు స్థానాలకు పరిమితమైంది. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు. అయితే చంద్రబాబు, బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు. ఇప్పటికే కుప్పంలో చాప కింద నీరులా పెద్దిరెడ్డి తన పని తాను చేస్తున్నారు. ఇప్పుడు హిందూపురంలో యాక్షన్ ప్లాన్ కు దిగారు. సోమవారం నుంచి ఆరు రోజులు పాటు నియోజకవర్గంలో మకాం వేయనున్నారు. నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి బాలకృష్ణ పై ఉసిగొల్పనున్నారు.
ఇటీవల హిందూపురం నియోజకవర్గానికి దీపికా రెడ్డి అనే నేతను ఇన్చార్జిగా పెట్టారు. అయితే ఇప్పటికే నియోజకవర్గ వైసీపీలో వర్గాలు ఉన్నాయి. దీపికారెడ్డి పెద్దగా చొచ్చుకెళ్లడం లేదు. నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ ఇక్బాల్ దీపికా రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ బలరామిరెడ్డి కూడా టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వైసీపీలో వర్గాలు తారాస్థాయికి చేరాయి. వారే బాలకృష్ణను దగ్గరుండి గెలిపిస్తారని అధిష్టానానికి నివేదికలు అందాయి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం పై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది.
అయితే వైసీపీలో సమీకరణలు మారాయి. పెనుగొండ నియోజకవర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేయడం ఖాయమైంది. అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన దీపికకు టికెట్ ఇవ్వరని తేలిపోయింది. దీంతో బాలకృష్ణను ఢీకొట్టే అభ్యర్థి ఎవరు అని వైసిపి హై కమాండ్ ఆరా తీస్తోంది. సర్వే కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఏకంగా ఆరు రోజులు పాటు హిందూపురంలో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దీనిపై బాలకృష్ణ అలెర్ట్ అయ్యారు. రెండు రోజులపాటు హిందూపురంలో పర్యటించనున్నారు. మరోవైపు వైసీపీ అసంతృప్త నాయకులు టిడిపికి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. అందుకే పెద్దిరెడ్డి సైతం వ్యూహాలు పన్నుతున్నారు. చంద్రబాబు తర్వాత బాలకృష్ణనే టార్గెట్ చేసుకోవడం విశేషం.