https://oktelugu.com/

Janasena-TDP Alliance: కేసీఆర్ వ్యూహంతో పవన్.. జనసేన-టీడీపీ పొత్తు ఫిక్స్.. సీట్ల లెక్క ఇదీ..

Janasena-TDP Alliance: టార్గెట్ ఫిక్స్.. ఏపీ నుంచి వైసీపీని తరిమికొట్టాలి. దానికోసం ఏమైనా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ‘వైసీపీ విముక్త ఏపీ’ కోసం ఎంతకైనా తెగించడానికి జనసేనాని రంగం సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి, సమయానుకూలంగా పొత్తులు ఉంటాయని తేల్చిచెప్పారు. ‘కేసీఆర్ వ్యూహాన్ని’ తెరపైకి తెచ్చారు. వైసీపీ విముక్త ఏపీ అని అన్నారంటే ఖచ్చితంగా అది టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన, టీడీపీ , బీజేపీ విడివిడిగా పోటీచేస్తే […]

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2022 / 09:46 AM IST
    Follow us on

    Janasena-TDP Alliance: టార్గెట్ ఫిక్స్.. ఏపీ నుంచి వైసీపీని తరిమికొట్టాలి. దానికోసం ఏమైనా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ‘వైసీపీ విముక్త ఏపీ’ కోసం ఎంతకైనా తెగించడానికి జనసేనాని రంగం సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి, సమయానుకూలంగా పొత్తులు ఉంటాయని తేల్చిచెప్పారు. ‘కేసీఆర్ వ్యూహాన్ని’ తెరపైకి తెచ్చారు. వైసీపీ విముక్త ఏపీ అని అన్నారంటే ఖచ్చితంగా అది టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన, టీడీపీ , బీజేపీ విడివిడిగా పోటీచేస్తే వైసీపీని ఓడించడం సాధ్యం కాదు. అందుకే కలిసి చేస్తే వైసీపీ నుంచి ఏపీకి విముక్తి. అందుకే ఈ కోణంలోనే పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నాడని అర్థమవుతోంది. ఇంతకీ కేసీఆర్ వ్యూహం ఏంటి ? పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ మాట అన్నాడు? ఎలా ముందుకెళుతాడన్నది ఆసక్తిగా మారింది.

    chandrababu, pawan kalyan

    -కేసీఆర్ వ్యూహం ఏంటి?
    తెలంగాణ సీఎం కేసీఆర్ తన రాష్ట్రం సాధించేందుకు ‘గొంగళి పురుగునైనా ముద్దాడుతానంటూ’ ఒకానొక సమయంలో భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆయనర్థం.. తెలంగాణ ఇస్తే తాను ఏం చేయడానికైనా రెడీ అని.. అందుకే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని.. ఫ్యామిలీని మొత్తం వెంటేసుకొని సోనియాగాంధీని కలిశారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ మాట తప్పారు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఒంటరిగా పోటీచేసి గెలిచారు. సీఎం అయ్యారు. కాంగ్రెస్ ను మోసం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాట తప్పడం.. మడమ తిప్పడం.. వ్యూహాత్మకంగా వెళ్లడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఫాఫం దీన్ని కాంగ్రెస్ తెలుసుకోలేకపోయింది.. దెబ్బైపోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను పవన్ కళ్యాణ్ అప్లై చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ పరిస్థితులను బట్టి ఒంటరిగా ముందుకెళ్లాలా? పొత్తులు కుదుర్చుకోవాలా? అప్పటి బలం.. బలగం బట్టి వెళుతానని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం.. రాష్ట్రం కోసం కేసీఆర్ చేసింది కరెక్టేనని చాలా మంది అంటుంటారు. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ బెటర్ పాలన అందించిందని రుజువు చేస్తున్నారు. ఇదే స్ట్రాటజీని జనసేనాని తను అన్వయించుకుంటున్నారు. కేసీఆర్ ఫార్ములాను పార్టీలో అప్లై చేస్తానంటున్నాడు.

    Also Read: Pawan Kalyan: అమరావతిపై తన స్టాండ్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

    -భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన పొత్తుపొడుపులు
    వచ్చే ఎన్నికల్లో కనుక టీడీపీకి, జనసేనకు అధికారం మిస్ అయితే ఇక జీవితకాలం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి గెలిచిన వైసీపీని ఆపడం ఈ రెండు పార్టీలతో అవ్వడం లేదు. అందుకే వైసీపీ విముక్త ఏపీ కోసం ఖచ్చితంగా ఇవి పొత్తు పెట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇందులోకి బీజేపీని పవన్ లాగుతారని.. మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించడం ఖాయమని అంటున్నారు. రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీతో పవన్ కు, చంద్రబాబుకు వైరం వ్యక్తిగత శత్రుత్వాన్ని మించి ఉంది. జగన్ ను ఓడించడానికి ఈ ఇద్దరు బాధితులు ఖచ్చితంగా కలవడానికి వెనుకాడరు. ఈ క్రమంలోనే సీట్ల లెక్క తేలితే జనసేనాని ముందుడుగు వేసే ఛాన్స్ ఉంటుంది.

    Janasena-TDP Alliance

    -జనసేనకు ఎన్ని సీట్లు.. బీజేపీకెన్ని?
    టీడీపీతో జనసేన పొత్తు కుదిరితే ప్రధాన పీఠముడి సీట్లు కేటాయింపే. 2014లో బలం లేక పవన్ కళ్యాణ్ సీట్లు కోరలేదు. చంద్రబాబు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు క్షేత్రస్తాయి నుంచి జనసేన బలంగా తయారైంది.కనీసం 40 సీట్లలో బలంగా పోటీపడగలదు. మిగతా చోట్ల జనసేన ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేయగలవు. అందుకే టీడీపీ కనీసం 40 సీట్లు ఇస్తే పొత్తుకు పవన్ కళ్యాణ్ రెడీ కావచ్చు. కర్ణాటకలో కూడా 45 సీట్లు గెలిచిన కుమారస్వామి సీఎం అయిపోయాడు. లక్ కలిసివస్తే.. ఇన్ని సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ కు పొత్తుల తక్కెడలో ఇలాంటి అవకాశం దక్కొచ్చు. ఇక బీజేపీకి ఓ 10 సీట్లు కేటాయించవచ్చు. మొత్తంగా 50 సీట్లను టీడీపీ కనుక వైసీపీని ఓడించేందుకు జనసేన-బీజేపీలకు కేటాయిస్తే జగన్ ఖేల్ ఖతం దుకాణం బంద్ అవుతుందని పచ్చపార్టీ నేతలు ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జనసేనకు ఓ 25 సీట్లు, బీజేపీకి 10లోపు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడట.. ఇన్ని తక్కువ సీట్లు ఈ రెండు పక్షాలను ఒప్పించడం కష్టమే. మరి పవన్ నిర్ణయంపైనే ఈ పొత్తులు ఆదారపడి ఉంటాయి.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాటలు.. చంద్రబాబు పార్టీ తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళతాయి. పవన్ చొరవతో బీజేపీ సైతం ఈ కూటమిలో చేరే అవకాశాలు ఉంటాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే కనుక నిజంగానే ‘వైసీపీ విముక్త ఏపీని’ చూడొచ్చు. కానీ సీట్ల లెక్కల్లో తేడా వస్తే మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడిపోవడం ఖాయం. ఇది అంతిమంగా వైసీపీకే లాభం. జనసేన, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని ఇప్పటికే వైసీపీ నేతలు చేయాల్సిందల్లా చేస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. పవన్ మాత్రం ఇప్పుడవన్నీ పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఆ తర్వాత బలాన్ని బట్టి ముందుకెళ్లాలని చూస్తున్నారు. జనసేన-టీడీపీ కలయికను బట్టే ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. వైసీపీ ఇది జరగకూడదని బలంగా కుట్రలు చేస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

    Also Read:Amit Shah: టీడీపీని ఇరుకునపెట్టడం.. కమ్మవర్గాన్ని ఆకర్షించడం..అమిత్ షా ప్లాన్ ఇదేనా?

    Tags