BJP- Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యారా? పొత్తుల ప్రకటనకు ముందే వారితో సుమాలోచనలు జరిపారా? వారి అనుమతితోనే ఆప్షన్లు ప్రకటించారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి, బీజేపీ పెద్దల అనుమతితోనే ఆప్షన్లు ప్రకటించారన్న ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది. ఇప్పటికే రాష్ట్రం నాశనమైపోయింది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే… పూర్తిగా నాశనమే! ఎట్టిపరిస్థితుల్లో వైసీపీని గద్దెదించాల్సిందే. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే మన అడుగులు, పొత్తులూ ఉండాలి అని పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆయన పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పొత్తులకు సంబంధించి తమకు మూడు ‘ఆప్షన్లు’ ఉన్నట్లు ప్రకటించారు.
ఒకటి… బీజేపీతో కలిసి అధికారంలోకి. రెండు… బీజేపీ, టీడీపీతో కలిసి పొత్తుతో అధికార సాధన.మూడు… జనసేన ఒంటరి పోరు! వెరసి… టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు తొలిసారిగా పవన్ ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం! అక్కడ… బీజేపీ అధిష్ఠానానికి దగ్గరగా ఉండే నేతలతో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణాలు, పొత్తులతోపాటు… రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజకీయంగా వేయాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన వ్యూహాలపైపవన్ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. జగన్ పరిపాలన తీరు, ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలను పవన్ ప్రస్తావించారు. బాధితులకు అండగా నిలిచేందుకు, పరామర్శించేందుకు వెళుతున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని, కేసులు పెడుతున్నారని వివరించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం దుంపనాశనవుతుంది. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో రాజకీయంగా అడుగులు వేద్దాం అని పవన్ సూచించినట్లు తెలిసింది. ఆ తర్వాతే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘మూడు ఆప్షన్ల’పై ప్రకటన చేయడం గమనార్హం.
Also Read: Hindus in Pakistan: పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఇదీ
వ్యూహాత్మక మౌనం..
పవన్ ప్రకటనల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రాష్ట్ర నాయకుల్లో ఒక వర్గం మాత్రం మొదటి ఆప్షన్ కే మద్దతు తెలిపారు. జనసేన, బీజేపీ కలిసి వెళితేనే ప్రయోజనమని వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయంతో ఉన్నా.. ఎన్నికలు ఇంకా సుదూరం ఉండడంతో సైలెంట్ నే ఆశ్రయించింది. . ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని పవన్‌కల్యాణ్ ఒకవైపు చెబుతుండగా… టీడీపీతో తమకు పొత్తు ఇష్టంలేదనేలా బీజేపీలోని ఒక వర్గం బహిరంగంగానే చెబుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన కోర్‌కమిటీ సమావేశంలో పొత్తుల అంశం చర్చకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ‘వైసీపీ, టీడీపీలతో మనకు పొత్తు ఉండదని చెబుదాం’ అని ఒకరిద్దరు నేతలు నడ్డాతో అన్నారు. ‘ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా! పొత్తుల సంగతి ఇప్పుడెందుకు?’ అని నడ్డా ప్రశ్నించారు. ‘మీడియా వాళ్లు అడుగుతున్నారు’ అని ఆ నేతలు చెప్పగా… ‘అడగడం మీడియా పని. వాళ్ల పని వాళ్లు చేస్తారు’ అని నడ్డా బదులిచ్చారు. మరోవైపు… అదే భేటీలో పాల్గొన్న మరికొందరు నేతలు, పొత్తులపై ఇప్పుడు ఎవరూ, ఏమీ మాట్లాడవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడే చెప్పారని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. ‘షా చెప్పాక ఇంకేముంది! అదే ఫైనల్’ అని నడ్డా కూడా తేల్చేశారు. అయితే పవన్ ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో చర్చించిన తరువాతే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిపోనివ్వనన్న కసితోనే కేంద్ర పెద్దలతో చర్చించారని తెలుస్తోంది.
కీలక వ్యాఖ్యలు
మరోవైపు… పొత్తులపై పవన్ ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గాలు వ్యూహాత్మక ప్రచారం మొదలుపెట్టాయి. ‘పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తోంది’ అని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిని పవన్ స్వయంగా ఖండించారు. దీంతో ప్రత్యర్థుల ఎత్తులు చిత్తయ్యాయి. అటు… బీజేపీ నిర్వహించిన ‘గోదావరి గర్జన’ సభలో నడ్డా కూడా పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదు. ఇప్పటికే తన మిత్రపక్షమైన జనసేన గురించి కూడా మాట్లాడలేదు. పైగా… ‘టీడీపీ గతంలో మోదీతో కలిసి ఉండేది. కానీ… బస్సు జస్ట్ మిస్ అయ్యింది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు వెనుక నిగూడార్థం ఉందని.. పవన్ ప్రతిపాదనలకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్న సంకేతాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:YCP MLAs Graph: గ్రాఫ్ పెంచుకునేదెలా? అధినేత అల్టిమేటంపై వైసీపీ నేతల మల్లగుల్లాలు