Janasean Pawan : కుల ఘర్షణలతో, ప్రాంతీయ విద్వేషాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసే పాలన వ్యవస్థ ఎంత మాత్రం భావి తరాలకు శ్రేయస్కరం కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలి అంటే ముందు నేరమయ రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రజల బాధలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని… వారి గొంతును వినిపించడాన్ని కూడా సహించలేని స్థితికి పాలక పక్షం చేరింది. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ఎంతమాత్రం మంచిది కాదు. నేరమయమైన రాజకీయాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బృహత్తర బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలి అంటే గుండె ధైర్యంతో ప్రజల పక్షాన నిలిచే నాయకులు ఉండాలి. అలాంటి నాయకులతో జనసేన ముందుకు వెళ్తుంది… ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
• ఆడబిడ్డలకు రక్షణ ఏదీ?
మహిళలకు రక్షణ అనేది ఎక్కడ ఉంది? ఆడ బిడ్డలపై అత్యాచారాలు పెరిగాయి.. అంతేకాదు మాకు అడ్డు వస్తే మీ ఇంటికొచ్చి అత్యాచారం చేస్తామనే స్థాయికి నేరమయ రాజకీయాలు చేరాయి. అంతే వ్యవస్థలను ఎంతగా నిర్వీర్యం చేశారో అర్థం చేసుకోవాలి. ప్రజా గొంతుకను వినిపించేవారిని వేధించే సంస్కృతి వచ్చింది. రాజకీయ కక్ష సాధింపు కేసులు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడితేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలం.రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. కుల ఘర్షణలు, ప్రాంతీయ విద్వేషాలు కావు… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తారక మంత్రం కావాలి. జనసేన పార్టీ ఈ దిశగా సైద్ధాంతిక బలంతో పని చేస్తుంది. ఇందుకోసం మనందరం పని చేయాలి. కులాలూ, మతాలు, ప్రాంతాల పేరుతో మనుషులను విడివిడిగా చూడటమే నేరమయ రాజకీయాలు చేసేవారి పని. ఇందుకు భిన్నంగా మనం అందరినీ సమూహంగా చేసి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధే లక్ష్యం అనే భావన పెంపొందించాలి” పవన్ అన్నారు.
ఈ సమావేశంలో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పట్ల, పార్టీ నేతలు, శ్రేణుల పట్ల ప్రభుత్వం అవలంభించిన అప్రజాస్వామిక విధానాలను ఖండించి సంఘీభావం తెలిపిన నాయకులకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానం ఆమోదించారు. అక్రమ కేసుల్లో అరెస్టైన వారికి, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమావేశం తీర్మానించింది. ఈ కేసుల్లో అరెస్టయిన వారికి న్యాయ సహాయం అందించిన పార్టీ లీగల్ సెల్ సభ్యులకు, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు కోన తాతారావు, పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, చేగొండి సూర్యప్రకాశ్, కనకరాజు సూరి, అర్హం ఖాన్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పాలవలస యశస్వి, చిలకం మధుసూదన్ రెడ్డి, పెదపూడి విజయ్ కుమార్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎ.వి.రత్నం, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, పోతిన వెంకట మహేశ్, బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వర రావు, షేక్ రియాజ్, మనుక్రాంత్ రెడ్డి, డా.హరిప్రసాద్, టి.సి.వరుణ్, పి.హరిప్రసాద్, కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.