Pawan Kalyan: సోలో బతుకే సో బెటర్ అన్నది బ్యాచ్ లర్స్ పాడే పాడే.. కానీ రాజకీయాల్లో ఎవరి సపోర్టు లేకుండా ‘సోలో’గా వెళ్లడం కష్టం. ఈరోజుల్లో రాజకీయాలన్నాక ‘సకుటుంబ సపరివార పాలిటిక్స్’గా మారాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ను తీసుకుంటే కొడుకు కేటీఆర్ మంత్రి, అల్లుడు హరీష్ కూడా మంత్రియే.. కూతురు కవిత ఎమ్మెల్సీ… ఇక చంద్రబాబు కుటుంబంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కొడుకు లోకేష్ మంత్రిగా ఉండేవాడు. బామ్మర్ది బాలయ్యను ఎమ్మెల్యేను చేశాడు. ఇక బంధువులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి కుటుంబ పాలిటిక్స్ ను నడిపించాడు.
ఇక జగన్ సంగతి చూస్తే పార్టీ పెట్టినప్పటి నుంచి తల్లి విజయమ్మ అండగా ఉంది. ఆమె ఎమ్మెల్యేగానూ పోటీచేసింది. ఆ తర్వాత జగన్ జైలుకు వెళ్లినప్పుడు చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసి మరీ అన్నయ్య అండగా నిలిచింది. 2014, 2019 ఎన్నికల ప్రచారంలోనూ జగన్ కు మద్దతుగా ప్రచారంలో షర్మిల పాల్గొంది. వైఎస్ కుటుంబమంతా జగన్ కు అండగా నిలిచింది.
అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం మెగా ఫ్యామిలీ మద్దతు పెద్దగా లభించలేదు. నాగబాబు మినహా ఎవరూ జనసేన పార్టీవైపు చూడలేదు. 2019 ఎన్నికల్లో రాంచరణ్, బన్నీ, వరుణ్ తేజ్ లు మద్దతు ప్రకటించారు కానీ జనసేన తరుఫున బరిలోకి దిగి ప్రచారాలు చేయలేదు.
కానీ మన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆది నుంచి ఒంటరిపోరాటమే చేస్తున్నారు. ఆయన జనసేన పార్టీని 2014లో స్థాపించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. పవన్ కు ఇతర పార్టీల లాగా కుటుంబ సభ్యుల మద్దతు దాదాపుగా లేదనే చెప్పాలి. పవన్ నిర్ణయాలు.. పార్టీ స్థాపనకు కుటుంబ సభ్యులు పెద్దగా వ్యతిరేకించకపోయినా మద్దతిచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. మెగా ఫ్యామిలీ మద్దతు పెద్దగా లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ముందుకు సాగుతోంది.
ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా వారి కుటుంబ సభ్యుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ప్రచారంలోనూ.. పార్టీ పరంగా కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా నిలుస్తారు. చంద్రబాబు సైతం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నా కూడా నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక్కటిగా నిలిచి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఏకంగా ఎన్నికల ప్రచారంలోనూ వారంతా టీడీపీ తరుఫున పాల్గొని విజయానికి కృషి చేశారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం టీడీపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
కానీ ఇదే జనసేనాని అన్నయ్య చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెడితే మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన వెంట నిలిచింది. బామ్మర్ధి అల్లు అరవింద్ అన్నీ వెనుకుండి నడిపించాడు. పవన్ కళ్యాణ్ అయితే ‘యువ రాజ్యం’ అధ్యక్షుడిగా ఉన్నాడు. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశాడు.
అయితే ఇదే తమ్ముడు పవన్ ‘జనసేన’ పెడితే మాత్రం చిరంజీవి ఇప్పటివరకూ మద్దతు ప్రకటించలేదు. జనసేనకు దూరంగానే చిరంజీవి ఉంటున్నారు. పాలిటిక్స్ కు దూరం అంటున్నాడు. ఇటీవల చిరంజీవి స్వయంగా జగన్ ను కలిసి ప్రశంసలు కురిపించడంతో జనసేనకు షాక్ తగిలినట్టైంది. క్యాడర్ ఇప్పటికీ చిరంజీవి చర్యలకు షాక్ లో ఉన్నారు. చిరంజీవి వచ్చే ఎన్నికల్లోనూ ఎవరికీ మద్దతు తెలుపకపోవచ్చు. కానీ జగన్ కు సాన్నిహిత్యంగా ఉండడం పవన్ కు మైనస్ గా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేయకతప్పదు.
నిజానికి చిరంజీవి రాజకీయాల్లో విఫలం అయ్యాక ఆయన రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించాక.. ఇక మెగా ఫ్యామిలీ సైతం రాజకీయాలను త్యజించింది. అందుకే పవన్ రాజకీయాల్లోకి రాకను వారంతా వ్యతిరేకించారు. పవన్ సైతం వారిని దూరంగా పెట్టడంతో ఇక ఒంటరిగానే పయనం సాగుతోంది.