Pawan Kalyan BCs : బీసీలు.. జనాభాలు 50శాతం వరకూ వాళ్లే.. కానీ రాజ్యాధికారం మాత్రం వారికి ఎప్పుడూ దక్కదు. అల్పంగా ఉన్న అగ్ర వర్ణాలు రెడ్డి, కమ్మ, వెలమలదే రాజ్యాధికారం. బీసీలను కేవలం తమ పల్లకీ మోసే బోయిలుగానే వారు చూస్తున్నారు తప్పితే ఏనాడు వారికి రాజ్యాధికారం కల్పించాలన్న సోయి అగ్రవర్ణాలకు లేదు. అందుకే బీసీలను ఐక్యం చేయడానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. మంగళగిరిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించి బీసీలు ఐక్యం కావాల్సి ఆవశ్యకతను విడమరిచి చెప్పారు. రాజకీయ చైతన్యంతో… ఒకరిని ప్రాధేయపడే పరిస్థితి మార్చండని పిలుపునిచ్చారు. కులానికో పదవి… రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారని ఆరోపించారు. కులంలో కొంతమంది చెంచాలు… కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని హితబోధ చేశారు. బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగాలని హెచ్చరించారు. తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంగళగిరిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో బలమైన శక్తిగా ఉన్న కాపులు, బీసీలను ఒక్కటి చేసే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా తోడైతే జనసేనదే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కులాలను వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప… కులాలు మాత్రం వెనకబడిపోతున్నాయని, ప్రతి కులంలోనూ ఈ సమస్య ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంఖ్యా బలం లేని కులాలు ఎంత ఐక్యతగా ఉంటాయో… సంఖ్యా బలం ఉన్న కులాలు కూడా అంతే ఐక్యతతో ఉంటే భవిష్యత్తులో రాష్ట్రం వారి చేతిలో ఉంటుందని అన్నారు. బీసీ కులాలకు ఒకొక్క దానికి ఒక్కో కార్పొరేషన్లు పెట్టి కులానికో పదవి, రూ. 75 వేలు జీతం పడేస్తే కులం మొత్తం మారు మాట్లాడకుండా ఉంటుందన్న భావన మారాలని, హక్కుల కోసం దేహీ అనే పరిస్థితి నుంచి హక్కులు సాధించుకునే పరిస్థితికి బీసీలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక మాట అటు ఇటు మాట్లాడితే ఇంకొకరిని బాధపెట్టినట్టు అయిపోతుంది. చిన్ననాటి నుంచి మానవత్వాన్ని ఇష్టపడ్డాను తప్ప కులాన్ని వేరే కోణం నుంచి చూస్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడికైనా కులం, మతం, ప్రాంతం అనే విషయాలు భయపడకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను కాబట్టి సామాజిక రుగ్మతలను సోషల్ డాక్టర్ మాదిరి చూస్తాను.
* వైసీపీ నాయకులు ఏం చేశారు?
ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో తూర్పు కాపు ఒకటి. ఉత్తరాంధ్ర వలస కూలీల్లో ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. ఒక ఎం.పి., ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గం నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 46 లక్షల మంది సంఖ్యాబలం ఉండి కూడా సమస్యల తీర్చండి అని ప్రాధేయపడటం బాధాకరం.
* అప్పీల్ చేయగలను
ఉమ్మడి రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న 26 కులాలను తెలంగాణలో తీసేశారు. తీసేసిన రెండు నెలలకు తూర్పు కాపులు నా దగ్గరకు వచ్చారు. మాకు అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో తీసేశారు. అధికారం చేతిలో ఉంటే ఎంతో కొంత చేయగలం. అది లేనప్పుడు కేవలం అప్పీల్ మాత్రమే చేయగలను. వైసీపీ నాయకులకు మీరు మద్దతు పలికారు. లేకపోతే అంత మెజారిటీ వచ్చేది కాదు. తూర్పు కాపులు ఒక బలమైన ఓటు శాతం వేశారు. వీరు తెలంగాణలో 26 కులాలను బీసీల్లో ఉంచమని కూడా చెప్పలేదు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు ఓసీబీ రిజర్వేషన్ అమలు చేయడం లేదు.
లంచం ఇస్తే తప్ప ఓబీసీ సర్టిఫికేట్ రాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలంటే… బీసీ కులాల నుంచి నాయకత్వం పెరగాలి. అలా కాకుండా కొంతమందికే పట్టం కడతాం అంటే….ఇంకా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
దేశ భావన, రాష్ట్ర భావన పెట్టుకోకపోయినా కనీసం కుల భావన అయిన పెట్టుకోండి. అలా అయిన కులం వృద్ధిలోకి వస్తుంది. కులంలోని వ్యక్తులు బాగుపడతారు. ప్రతి కులంలో కొందరు ఉంటారు.. కాన్షీరాం గారి భాషలో చెప్పాలంటే చెంచాలు. స్వలాభం కోసం కుల ప్రయోజనాలను పణంగా పెడతారు. 2024 ఎన్నికల తరువాత ఇలాంటి మీటింగ్స్ మళ్లీ జరగకూడదు. ఎలాంటి మీటింగ్స్ జరగాలంటే ఫలానా శ్రీ కురిటి సత్యం నాయుడు అనే రంగస్థల కళాకారుడికి ఫలానా అవార్డు ఇవ్వాలి అనే చర్చించుకునే స్థితిలో మీటింగ్స్ జరగాలి. అలాంటి పరిస్థితుల్లో తూర్పుకాపులను చూడాలి. వాళ్ల మాటలు వినకపోతే బెదిరిస్తారు. కేసులు పెడతారు. చంపేస్తామని అంటారు. ఇప్పుడు పోరాడకపోతే జీవితాంతం వాళ్ల మోచేతి నీళ్లు తాగుతూ బతకాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి. కుల ప్రయోజనాలను కాపాడే నాయకులను ముందుకు నిలబెట్టండి. వాళ్లను డబ్బు లేకపోయినా ఫర్వాలేదు. సమస్యలపై నిలబడే సత్తా ఉండే నాయకులను నిలబెట్టండి. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్దిమంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుంది.
* బొత్సగారి పరిస్థితే అలా ఉంటే మీ పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో ఒక మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తూర్పుకాపుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా మీ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు కూడా మీ సమస్యలను అధినాయకత్వానికి చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదు. ఆయన పరిస్థితే అలా ఉంటే ఇక మీ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోండి. మీ సమస్యల పరిష్కారానికి జనసేన నిలబడుతుందని మనస్ఫూర్తిగా నమ్మితే జనసేన పార్టీకి ఓటు వేయండి. తెలంగాణలో పర్యటించినప్పుడు బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను.
* ఆయన కోడి కత్తి డ్రామా ఆడుతుంటే..
నేను శ్రీకాకుళంలో పర్యటించలేదని, ఉద్ధానం సమస్య గురించి తెలీదు అన్నట్లు ముఖ్యమంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నప్పుడు నేను ఉద్ధానంలో తిరుగుతున్నాను. ఆయనకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. ఉద్ధానం సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేశాను. ఆయనకు నిజంగా కిడ్నీ బాధితుల పట్ల ప్రేమ ఉంటే… ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. నేను వాళ్లలా తేనే పూసిన కత్తిని కాదు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయను. ఒక్క సినిమాను ఆపడానికి వాళ్లు యంత్రాంగాన్ని అంతా ఉపయోగించినప్పుడు.. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిపికేట్ ఇవ్వడానికి మనం ఎందుకు యంత్రాగాన్ని వాడకూడదు.. అధికారాన్ని వాళ్లు దుర్వినియోగం చేస్తే… మేము సద్వినియోగం చేస్తాం. తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతాం. వాళ్ల హక్కుల కోసం దేహీ అనే పరిస్థితి నుంచి సాధించుకునే స్థితికి తీసుకెళ్తామ”ని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఏపీలో బలంగా.. ప్రబలంగా ఉన్న కాపులు, బీసీలను ఏకం చేసేలా పవన్ కల్యాణ్ పాటుపడుతున్నారు. ఇది రెడ్డి వైసీపీ, కమ్మ టీడీపీ మదిలో గుబులు రేపుతోంది. బీసీలంతా ఏకమైతే జనసేనదే విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు విడగొట్టి పాలించిన కమ్మ, రెడ్లకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు కలవరపెడుతున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Pawan kalyans plan for unity of bcs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com