Pawan Kalyan
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ నుంచి విముక్తి చేయాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెంచిన పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు. అమరావతి కేంద్రంగానే రాజకీయాలు, సినిమాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఏపనైనా ఏపీ నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
సందిగ్ధానికి తెర దించుతూ..
ఒకవైపు సినిమాలు.. ఇంకోవైపు రాజకీయాలు.. ఇందులో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయంలో పవన్ కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉండేవారు. ఇది అధికార పక్షానికి ఆయుధంగా మారింది. సినిమాలు లేనప్పుడే పవన్ రాజకీయాలు చేస్తారని, పవన్‌కు రాజకీయాలు టైంపాస్ అని ఆరోపణలు చేసేవారు. దీంతో క్యాడర్‌లోనూ కొంత సందిగ్ధం ఉండేది. ఈ క్రమంలో విమర్శలకు సమాధానం చెప్పేలా క్యాడర్‌లో కన్ఫ్యూజన్‌కు తెర దించేలా అడుగులు వేస్తున్నారు.
అంతా అమరావతి నుంచే..
ఇకపై ఏ పని చేసినా అమరావతిలోనే ఫైనల్ చేయాలని పవన్ భావిస్తున్నారు. అది సినిమాలు అయినా, రాజకీయ వ్యూహాలు అయినా ఇక్కడే డిసైట్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రెండురోజులుగా మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉంటూ పవన్ తన ఫైనల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఇకపై పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిపెట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సినిమాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా కొత్త ప్లాన్ సిద్ధం చేసుకున్నారు జన సేనాని. ఇకపై సినిమా కథలు, అగ్రిమెంట్లు, చర్చలు అన్నీ అమరావతిలోనే జరపాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు తన నిర్మాతలు, దర్శకులను మంగళగిరికే పిలిపించి మాట్లాడుతున్నారు.
సహకరిస్తున్న దర్శక నిర్మాతలు..
జన సేనానిని ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న పవన్ దర్శక నిర్మాతలు ఇకపై ఆయనను ఇబ్బంది పెట్టొద్దని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలపై పూర్తిగా ఫోక్ పెట్టిన పవన్‌తో ఏ చర్చలైనా మంగళగిరిలోనే జరపాలని నిర్ణయించారు. ఈమేరకు జనసేనాని రూపొందించిన బ్యాలెన్స్ ఫార్ములాకు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.
షూటింగ్‌లు కూడా ఇక్కడే..
ఇకపై సినిమా షూటింగ్‌లు కూడా మంగళగిరి, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చేయాలని జనసేనాని భావిస్తున్నారు. ఈమేరకు దర్శక, నిర్మాతలతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంతకాలం షూటింగ్స్ చేసేందుకు వీలుగా అనువైన లొకేషన్స్‌ను నిర్మాతలు, దర్శకులు తాజాగా పరిశీలించారు. ఇందుకు తగినట్లుగా సినిమాల్లో స్కిప్ట్, స్టోరీ, లొకేషన్స్ సెట్ చేసే పనిలో వారు బిజీగా ఉన్నారు. ప్రాథమికంగా అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్స్ కు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ఓ ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతానికి గోదావరి జిల్లాల్లో మొదలుపెడుతున్న వారాహి యాత్రకు హాజరై, అనంతరం తిరిగి షూటింగ్స్ లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.