Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్

Pawan Kalyan: ప్రతీ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. అది కామన్ పాయింట్. అయితే కొన్ని పార్టీలకే సాధ్యమవుతుంది. కొందరు ప్రయత్నించి.. విసిగి వేశారిపోయి పార్టీని నడపలేక ఏదో వంకతో జాతీయ పార్టీల్లో విలీనం చేస్తుంటారు. అటువంటి విలీన పార్టీలను చాలానే చూశాం. వాస్తవానికి పార్టీ నడపడం అంత సులభం కాదు. తెలుగునాట పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఎన్టీఆర్ అధికారంలోకి రాగలిగారు. అటు తరువాత అదే స్ఫూర్తితో ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక పార్టీలు పురుడు పోసుకున్న చాలా పార్టీలు కనుమరుగయ్యాయి. కొన్ని మంచి ముహూర్తాన జాతీయ పార్టీల్లో విలీనమయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక పార్టీలు అవతరించాయి. కానీ అవేవీ నిలబడలేదు. ప్రస్తుతం కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు. కానీ మిగతా రాజకీయ పక్షాలను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పార్టీని నడపాలంటే ఒక అజెండా ఉండాలి. కష్టమైనా, చావైనా, రేవయినా, గెలుపైనా, ఓటమయినా సమానంగా తీసుకున్ననాడే పార్టీ నడపగలం లేకుంటే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుంది. అయితే ఇటువంటి సమస్యలను అధిగమించి పార్టీని నడిపించిన ఘనత మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది.

Pawan Kalyan
Pawan Kalyan

ప్రజా సమస్యలే అజెండా..
జనసేన ఆవిర్భవించి దాదాపు తొమ్మిదేళ్లు సమీపిస్తోంది. కానీ ఇంకా గెలుపు పలకరించలేదు. అయినా పవన్ ప్రజా సమస్యల అజెండాగా ముందుకు సాగుతున్నారు. బహుశా పార్టీ ఆవిర్భవించిన ఇన్నాళ్లూ అధికారంలో లేకపోయినా..రాకపోయినా రాజకీయంగా నిలబడ్డారంటే అది పవన్ గొప్పదనంగా చెప్పుకోవాలి. మొండిగా ముందుకు సాగుతున్నారంటే ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. ప్రజా సమస్యలే అజెండాగా తీసుకొని ఆయన ముందుకు సాగుతున్న తీరు మాత్రం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. అందుకే చాలావర్గాలు ఆయనకు దగ్గరవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. సామాజిక రుగ్మతలు, ప్రాంతీయ సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరుతో ఇన్నాళ్లూ పవన్ తో విభేదించే వారు సైతం యూటర్న్ తీసుకుంటున్నారు. పవన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఆయనకు ఒక చాన్స్ ఇద్దామని నిర్ణయానికి వస్తున్నారు.

Also Read: Chiranjeevi- Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒకే వేడుక పై చిరు – పవన్.. లీకైన భారీ సర్ ప్రైజ్

మిత్రపక్షంగా ఉన్నా క్రమశిక్షణే...
2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పవన్ మద్దతు తెలిపారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తాను బలపరచిన ప్రభుత్వాలే వచ్చాయి. కానీ తాను నమ్ముకున్న సమస్యలపై పోరాట అజెండాను మాత్రం పవన్ వీడలేదు. ఉద్దానం కిడ్నీ సమస్య నుంచి కౌలురైతుల సంక్షేమం వరకూ పోరాడింది పవనే. అటు తాను నచ్చిన ప్రధాని మోదీ ఉన్నా.. ప్రజా సమస్యల విషయంలో మాత్రం గట్టిగానే మాట్లాడే వారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్రత్యేక రైల్వేజోన్లు, రాజధాని ఏర్పాటు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ పై గట్టి వాణినే వినిపించారు. మిత్రపక్షంగా ఉన్నా ఎప్పుడూ కేంద్ర పెద్దలకు సాగిలాపడలేదు. మిత్రుడిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరికి రాజీ పడలేదు. హంగూ ఆర్భాటాలకు పోలేదు. కేంద్ర పెద్దలతో ఉన్న చనువును వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించలేదు. మాటమాటకి ప్రధానితో పాటు పెద్దలను కలవలేదు. దర్పం ప్రకటించలేదు.

Pawan Kalyan
Pawan Kalyan

ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు..
రాష్ట్ర జనాభాలో సింహభాగంగా ఉన్నది రైతులు. తరువాత ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వారంతా ఇప్పుడు పవన్ వైపు చూడడం ప్రారంభించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించిన తొలి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. నాడు విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తలపెట్టిన మిలియన్ మార్చ్ కు పవన్ సంఘీభావం తెలిపారు. దీంతో ఆ రెండు వర్గాల్లో ఆలోచన ప్రారంభమైంది. రాష్ట్రానికి ఉన్న ప్రత్యామ్నాయ నాయకుడిగా పవన్ చూడడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎటువంటి సమస్య ఉన్నా పవన్ కు వినతులు అందించడం కూడా చేస్తున్నారు. ఇటీవల సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకమయ్యారు. వారంతా ఇప్పుడు పవన్ జపమే చేస్తున్నారు. పవన్ తోనే అన్నివర్గాల సంక్షేమం సాధ్యమని భావిస్తున్నారు.

రైతు పక్షపాతిగా..
మరోవైపు కర్షక వర్గాలు సైతం పవన్ ను అభిమానిస్తున్నాయి. ఇటీవల ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కౌలురైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయమందించారు. ఇందుకుగాను రూ.3 కోట్లతో సొంత నిధిని ఏర్పాటుచేశారు. అటు సాగుపరంగా గిట్టుబాటు, మద్దతుధర వంటి విషయంలో పవన్ గట్టిగానే మాట్లాడుతున్నారు. రైతుకు స్వాంతన చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ రైతుల అభిమానాన్ని చూరగొంటున్నాయి. ఈ పరిణామాల క్రమంలో పవన్ గ్రాఫ్ ఏపీ నాట గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాజకీయ పక్షాలు, వివిధ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేల్లో సైతం ఇదే వెలుగుచూస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ అతీతమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ లేని ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.

Also Read:Odisha- Ant Attacks: ఒడిశాలో ఓ ఊరిపై విషపూరిత చీమల దాడి.. పారిపోయిన గ్రామస్థులు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

Exit mobile version