Pawan Kalyan Varaahi Tour : ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ముక్త రాష్ట్రం చేయాలన్న సంకల్పంతో కదనరంగంలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్నారు. దీనికి అంత్యంత శక్తివంతైమన అమ్మవారి పేరు వారాహి అని పెట్టారు. తాను సెంటిమెంట్‌గా భావించే కొండగట్టులో ఈ వాహనానికి పూజలు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు జనవరి 24న ముహూర్తం నిశ్చయించారు. ఈమేరకు పవన్ కల్యాణ్ ఉమ్మడి కరీంనగర్ పర్యటనకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను జనసేన తెలంగాణ ఇన్‌చార్జి శంకర్ గౌడ్ విడుదల చేశారు.
-ఉదయం 11 గంటలకు కొండగట్టులో పూజలు..
జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. ఆలయంలో పూజ తర్వాత వారాహి వాహన పూజ నిర్వహిస్తారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్ కు చేరుకుని రెండు గంటలపాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
-ధర్మపురి లక్ష్మీనారసింహుడి దర్శనం..
ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం)ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీలక్ష్మీనారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.
-అంజన్న సెంటిమెంటు..
2009లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పవన్ కొండగట్టుకు వచ్చారు. అప్పుడు ఆయన ప్రచార వాహనానికి అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురైంది. అయితే ఎలాంటి నష్టం జరుగలేదు. కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు.
-వారాహికి అందుకే పూజలు..
కొత్త వాహనాలకు కొండగట్టులో పూజలు చేయించడం తెలంగాణలో చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను చేపట్టబోయే యాత్రకు ఎలాంటి ఆటంకం కలుగకూడాతని తాను కొత్తగా తయారు చేయించిన వారాహి వాహనానికి పూజలు చేయించాలని నిర్ణయించారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు తనను కాపాడిన ఆంజనేయుడు.. త్వరలో చేపట్టబోయే యాత్రకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూస్తాడని పవన్ తనకు అత్యంత ఇష్టమైన కొంటగట్టు ఆంజనేయుడు కాపాడుతాడని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.