Pawan Kalyan Kapu Community : ఒక కర్రను విరిచేయడం ఈజీ.. కానీ ఒక కర్రల మూటను విరిచేయడం అంత ఈజీ కాదు. ఏపీలో ‘కాపులు’ అంతే.. ఏపీ జనాభాలో రాజకీయాలను శాసించేలా ప్రబలంగా ఉన్నారు కాపులు. కానీ విడిపోయి అగ్రవర్ణాలకు అధికారం అప్పగించేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాపులను ద్వితీయ శ్రేణి నేతలుగానే చూస్తున్నారు. అటు చంద్రబాబు అయినా.. ఇటు జగన్ అయినా తమ తర్వాతీ స్థానంలో పల్లకీ మోసే బోయలుగానే చూస్తున్నారన్న ఆవేదన కాపుల్లో ఉంది. ఏపీ రాజకీయాలను శాసించగల సామర్థ్యం ఉన్న కాపులు అనైక్యతతో ఎవరి దారి వారు చూసుకుంటూ వివిధ పార్టీల్లో ఉంటూ అధికారానికి దూరం అవుతున్నారన్న టాక్ ఆ వర్గంలో ఉంది. మరి వారందరినీ ఏకం చేసే వారు ఎవరు? వారంతా ఐక్యమత్యం పాటిస్తారా? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
-కాపులు దగాపడ్డారు?
ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కాపులు దగాపడుతూనే ఉన్నారు. కమ్మ, రెడ్డి సామాజికవర్గం కబంధ హస్తాల్లోనే నలిగిపోతున్నారు. కాపుల్లోని అనైక్యతనే ఇందుకు కారణం. కాపులను ఒక్కటి చేయాలని ముద్రగడ లాంటి నేతలు ముందుకొచ్చినా అవి తీరం చేరలేదు. కాపులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు అప్పట్లో తునిలో నిరసన చేపట్టారు. రాజకీయంగా కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం వారిని కట్టడి చేయలేకపోయింది. అప్పట్లో ఈ ఘటన అత్యంత గొడవలకు కేంద్ర బిందువు అయింది. కానీ తర్వాత చప్పున చల్లారిపోయింది. ఓసారి ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడం.. ఆ తర్వాత సైలెన్స్ అయ్యి లేఖలతో రాజకీయం నడపడం ముద్రగడకు అలవాటుగా మారిందన్న విమర్శలున్నాయి. ఆయన కేసీఆర్ తరహాలో ఉద్యమాన్ని నిర్మించి ఫలవంతం చేయడం లేదన్న ఆవేదన కాపుల్లో ఉంది. ఇక ఉద్యమించే కాపు నేతలను వదిలేసి.. అస్సలు కాపుల కోసం ఏనాడు రోడ్డెక్కని సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్యతో పవన్ మంతనాలు జరపడం పెద్ద మైనస్ గా అభివర్ణిస్తున్నారు. ఇక యాక్టివ్ గా ఉండే కాపు నేతలను కూడా పవన్ దగ్గరకు రానీయపోవడంతో కాపులు ఎలా పవన్ వైపు మరలుతారన్నది ఇక్కడ ప్రశ్న. దీనివల్లే పవన్ కు కాపులు దూరమవుతున్నారంటున్నారు. ఇక ఏపీలోని బలిజల్లో చాలా సమస్యలున్నాయి. రాయలసీమలో బలిజలు దీన స్థితిలో ఉన్నారు. వారి విషయంలో పవన్ ఇంతవరకూ మాట్లాడిన పాపాన పోలేదు. ఎప్పుడూ కులం కార్డు వాడను అని చెప్పే పవన్ తన సొంత సామాజికవర్గంలోని సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదు. పరిష్కరించనూ లేదు. అందుకే కాపులు పవన్ వైపు మరలడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-2014లో టీడీపీ గెలుపునకు కారణమేంటి?
ఏపీ రాజకీయ యవనికపై కాపులు ఎటువైపు నిలిస్తే వారిదే విజయం. 2014లో అసలు చంద్రబాబు గెలవడని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు బీజేపీ,జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల కాపులు గంపగుత్తగా ఈ కూటమికి ఓట్లేసి గెలిపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా కాపు.. అప్పటి కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు సహా బీజేపీ నేతలూ కాపు సామాజికవర్గమే. అలా కాపు ఓటు బ్యాంకు ఎటూ చీలకుండా పడడంతో చంద్రబాబు సీఎం కాగలిగారు. ఇదే కాపు ఓటు బ్యాంక్ అండగా లేకపోతే జగన్ గెలిచేవాడు. పవన్ కళ్యాణ్ కలవడం వల్ల చంద్రబాబు గెలిచాడు. కాపులే ఏపీ రాజ్యాధికారాన్ని నిర్ధేశించే స్థాయిలో ఉన్నారనడానికి 2014 ఎన్నికలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
-2019లో వైసీపీకి కాపులు ఎందుకు అండగా నిలిచి గెలిపించారు?
2014లో ఉన్న కాపుల ఐక్యత 2019కి వచ్చేసరికి చీలిపోయిన పరిస్థితి తలెత్తింది. పవన్ కళ్యాణ్ తన పొత్తు పెట్టుకొని గెలిపించిన టీడీపీ, బీజేపీలపై తిరుగుబాటు చేశాడు. వాటిని వ్యతిరేకిస్తూ ఒంటరిగా పోటీచేశారు. ఇక 2014 ఎన్నికల్లో కాపులంతా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి మద్దతుగా నిలిచినా వారికి పెద్దగా ప్రయోజనం కలుగలేదు. టీడీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ విషయంలో కాపులకు హ్యండివ్వడంతో వారంతా 2019 ఎన్నికల్లో జగన్ కు జై కొట్టారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని అతిపెద్ద హామీ ఇచ్చారు. కాపులంతా వైసీపీకి సపోర్టు చేయడంతో జగన్ ఏపీలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. కాపుల్లో కొందరు మాత్రం ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చారు. మెజార్టీ కాపులు వైసీపీ వైపు మొగ్గుచూపడంతో ఆపార్టీనే అధికారంలోకి వచ్చింది. గతంలో కాపు పార్టీగా తెరపైకి వచ్చిన ప్రజారాజ్యం స్థాయిలో కూడా జనసేనకు కాపు ఓట్లు రాకపోవడం గమనార్హం. ఒంటరిగా పోటీచేసిన జనసేనకు వాళ్లు అండగా నిలవలేకపోయారు. దీనికి కారణం చంద్రబాబుపై వ్యతిరేకత.. పవన్ కాపులను ఓన్ చేసుకోకపోవడం కూడా మైనస్ అయ్యింది. పవన్ ఎప్పుడూ తన కులం వారి విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం.. ఆ సామాజికవర్గం నేతలను అక్కున చేర్చుకోకపోవడంతో కాపులు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ పదేళ్లుగా ప్రతిపక్షంలో పోరాడుతున్న వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆయనకు గంపగుత్తగా ఓట్లేసి గెలిపించారు. 2019లో పవన్ వైపు కాపులు లేరు. అందరూ వైసీపీకి అండగా నిలవడంతో ఆ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచింది
-బీజేపీ నేతలు కాపులను ఎందుకు ఎత్తుకున్నారు?
ఏపీలో ప్రబల శక్తిగా రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కాపుల కోసం తాజాగా బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ కేంద్రం నుంచి నరుక్కువస్తున్నారు. కాపుల ఉద్యమాన్ని రగిలించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే కాపుల రిజర్వేషన్లపై గళమెత్తింది. కాపుల సమస్యలను పార్లమెంట్ సాక్షిగా ఎంపీ జీవీఎల్ లేవనెత్తి పరిష్కారం దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అనంతరం ఏపీకి వచ్చి కాపు ఉద్యమ కారుడైన ముద్రగడ తో జీవీఎల్ నరసింహరావు భేటీ అయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి వచ్చిన జీవీఎల్ కాపుల సమస్యలు పరిష్కరిస్తామని.. తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్టు తెలిసింది. గతంలో రాజ్యసభకు గానీ.. లోక్‌సభ కు ఎంపికైన కాపు నాయకులు ఏనాడూ కాపులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏమైనా మాట్లాడితే తమ అధినాయకుడు తమ తోకలను కత్తిరిస్తారని భయంతో ఉండేవారు. ఈక్రమంలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు చొరవ తీసుకున్నారు. బీజేపీ అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి కాపుల సమస్యలను వివరించడంతో తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గం బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు..
Also Read: 40 Years For TDP: టీడీపీ @40 ఇయర్స్.. తమ్ముళ్ల ఆవేదన పట్టించుకోండయ్యా చంద్రబాబు..
-అంతర్గతంగా కాపులకు ఉన్న సమస్యలనే అజెండానా?
ఏపీలో కాపుల కోసం అది ఇది చేస్తామంటూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మోసాలు చేస్తూనే ఉన్నాయి. కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు దాన్ని నెరవేర్చడంలో చేస్తున్న తాత్సారంపై కాపులు ఆగ్రహంగా ఉన్నారు. కాపు నేస్తం అంటూ కోట్లు ప్రకటిస్తున్నారు. కానీ కాపుల సంక్షేమానికి ఆ డబ్బులు వాడకుండా ఇతర సంక్షేమ రంగాలకు మళ్లించడం కాపుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద కాపులకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఆ వర్గంలో డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఎవరూ ఓన్ చేసుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు. కాపుల రిజర్వేషన్ల కోసం చాలా ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయన ఏ పార్టీలోనూ లేరు. అలాంటి నేత అప్పుడో ఇప్పుడో కాపుల కోసం వయసు మీద పడ్డ తరుణంలోనూ ఉద్యమిస్తున్నారు. కానీ కాపుల్లో అనైక్యత.. కాపు నేతలకు టీడీపీ, వైసీపీ పదవుల పందేరంతో ఆయనకు మద్దతు కరువవుతోంది. వివిధ పార్టీలలో కాపు రాజకీయనాయకులు వున్నా వారు తమ పార్టీ అధిష్టానానికి సేవలు చేస్తూ తరిస్తున్నారు. ఎవరు ఏరోజు కాపు కులం గురించి గానీ.. రిజర్వేషన్స్ గురుంచి గాని పోరాడిన చరిత్ర లేదు. ఇక పవన్ కళ్యాణ్ సైతం తమ సామాజికవర్గం ఎప్పటి నుంచో కోరుతున్న ఈ మేజర్ సమస్యపై ఇంతవరకూ తీవ్రంగా పోరాడిన దాఖలాలు పెద్దగా లేవు.
-కాపుల సమస్యలను పరిష్కరించినప్పుడే కాపులు పవన్ తో వస్తారా?
ఏరోజు కాపుల గురించి కాపు ఉద్యమం గురుంచి మాట్లాడని హరిరామ జోగయ్య ‘కాపు సంక్షేమ సేన’ని నెలకొల్పటమే ఒక విడ్డూరంగా చెప్పొచ్చు. ఇక దానిని గుర్తిస్తూ వారితో పవన్ కళ్యాణ్ చర్చలు జరపడం ఆ వర్గంలో అసంతృప్తికి కారణమైంది. అయితే ఇది పూర్తిగా ముద్రగడ కి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రయత్నమే. ఇన్నాళ్లుగా పోరాటం చేసిన ముద్రగడకి వ్యతిరేఖంగా కాపులలో చీలికి తీసుకు రావటం పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు అన్నవారున్నారు. ఏరోజు కాపు సమస్యల పరిష్కారం గురించి పోరాడని హరిరామ జోగయ్యని తెరపైకి తెచ్చి కాపు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధుల వినియోగం.. కాపు సామాజికవర్గానికి ఇబ్బందులు, రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కాకపోవడం సమస్యలను పవన్ కళ్యాణ్ చర్చించడం ఎంతవరకు సబబు అని కాపులే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాపుల పేరుతో గత సారి చంద్రబాబు, బీజేపీకి మద్దతిచ్చి సైడ్ అయిపోయారన్న విమర్శ ఉంది.. ఈసారి ముద్రగడకు వ్యతిరేకంగా హరిరామ జోగయ్యతో సాన్నిహిత్యం నెరపడంతో కాపులు పవన్ ను నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ కాపుల కోసం పాటుపడని హరిరామ జోగయ్యతో పవన్ కలవడాన్ని ఏ కాపులు హర్షించడం లేదు.
-కాపుల ఐక్యతకు పవన్ చేయాల్సిన పనులేంటి?
కాపు రిజర్వేషన్స్ సాధించటానికి కీలకమైన 9వ షెడ్యూల్ లో ఈ అంశం చేర్చించాలని కేంద్రాన్ని పవన్ ఇప్పటిదాకా కోరింది లేదు. కేంద్రంతో అంత సయోధ్యగా ఉండే పవన్ ఈ పని ఎప్పుడో చేయవచ్చు. కానీ ఆయన కాపుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్న ఆవేదన ఆ వర్గం నేతల్లో ఉంది. కాపులకు మేలు చేసే ప్రాసెస్ లో 9వ షెడ్యూల్ లో కాపులను చేర్పించి న్యాయం చేస్తాడా? కాపుల తరుఫున బరిగీసి నిలబడుతారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ విషయాన్ని హైలెట్ చేస్తాడా? కాపులను ఇప్పటికైనా రాజకీయంగా నిలబెడుతాడా? సాము వీర్రాజు లాంటి కాపు నేతతో కలిసి అధికారాన్ని అందుకునే స్థాయికి వస్తాడా? ఈ ప్రాసెస్ లో అందరు కాపు నేతలను.. ముద్రగడతో సహా కలుపుకుపోతాడా? అన్నదే జనసేన విజయావకాశాలపై ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాపుల్లోని అనైక్యతే వారిని రాజకీయ అధికారానికి దూరం చేస్తోందని.. టీడీపీ, వైసీపీ లకు కాపులు మారడానికి ఇదే కారణమంటున్నారు. ఇప్పటికైనా కాపుల ప్రధాన డిమాండ్లను పవన్ కళ్యాణ్ లేవనెత్తాలి. వాటి పరిష్కారం కోసం పోరాడాలి. కాపు ఓటర్ల ప్రసన్నం కోసం పావులు కదపాలి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రణాళికలు రచిస్తోంది. ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా చేసుకుని పాలిస్తున్న పార్టీల గుట్టు రట్టు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు సరైన నేత లేకపోవడంతోనే కాపులు రాజకీయ పావులుగా మారారని తెలియజేసేందుకు పవన్ కళ్యాణ్ వివిధ మార్గాల్లో వారికి అవగాహన కల్పించేందుకు రెడీ అయినట్లు సమాచారం. తన సాన్నిహిత్యమైన కేంద్రాన్ని ఒప్పించి కాపుల సమస్యలు పరిష్కరించి వారి అభిమానాన్ని చూరగొనాలి. అప్పుడే కాపులంతా పవన్ వెంట నిలబడుతారు. రాబోయే ఎన్నికల్లో విజయాన్ని అందిస్తారు.
Also Read: Kodali Nani: మంత్రి కొడాలి నాని స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
Recommended Video: