Pawan kalyan: “ఇప్పటి వరకూ నేను ఒక ఆర్గనైజేషన్ గానే ముందుకు సాగాను. ఇక మీద నేను కూడా సిసలైన రాజకీయం చేస్తా.” ఇదీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మీడియా సమావేశంలో చేసిన ప్రకటన. ఈ ప్రకటనకు అనుగుణంగా ప్రణాళికలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ మధ్య పవన్ కాపుల గురించి నేరుగా సభలు, సమావేశాల్లోనే ప్రస్తావిస్తున్నారు. కాపు, ఒంటరి, బలిజలు ఏకమై రాజకీయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారిని జనసేన వైపుగా మళ్లించాల్సిన ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం.

నిన్నా మొన్నటి వరకు కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో సాగింది. టీడీపీ సర్కారు ఉన్న సమయంలో కాపులను బీసీల్లో చేర్చాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి దగ్గరయ్యారనే విశ్లేషణలు సాగాయి. అప్పుడు పవన్ కాపుల విషయంలో ఒక స్టాండ్ తీసుకోకపోవడం కూడా ఓ కారణంగా చెబుతారు. కానీ.. ఇప్పుడు పవన్ ఓపెన్ అయ్యారు. రాజకీయాల్లా మార్పు రావాలని, దానికి కాపులే నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే.. కాపు సంక్షేమ సేన పవన్ వెంట నడిచేందుకు సిద్ధమవుతోందనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా.. పోస్టు కార్డు ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కాపు రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరిస్తూ.. ప్రతీ నియోజకవర్గం నుంచీ.. వెయ్యి పోస్టు కార్డులు ముఖ్యమంత్రికి పంపించాలని నిర్ణయించారు.
ఇక, మరో సీనియర్ రాజకీయ నేత హరి రామ జోగయ్య కూడా పవన్ కు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ సమయాన్ని అనుకూలంగా మలుచుకొని, కాపు, బలిజ, ఒంటరి కులస్థులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఈ ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయన్నది చూడాలి.