
Pawan Kalyan – Bandi Sanjay : గత ఎన్నికల అనంతరం పవన్ బీజేపీతో దోస్తీ కట్టారు. అయితే అది ఏపీ వరకూ మాత్రమే పరిమితమైంది. అది కూడా మాటలే కలిశాయి తప్ప…ఆ రెండు పార్టీలు కలిసి చేసిన కార్యక్రమాలేవీ లేవు. సహకారం ఇచ్చిపుచ్చుకున్న దాఖలాలు కనిపించలేదు. తెలంగాణ విషయంలో మాత్రం పవన్ ఆది నుంచి దూరంగానే ఉన్నారు. అటు తెలంగాణ బీజేపీ నేతలు సైతం పవన్ ను లైట్ తీసుకుంటూ వస్తున్నారు. దీంతో వారి మధ్య సంబంధం బంధవ్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. అదే సమయంలో ఢిల్లీ పెద్దలతో మాత్రం పవన్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కీలక చర్చలు జరిపారు. ఏపీలో 2014 తరహాలో టీడీపీతో కలిసి పోటీచేద్దామన్న ప్రతిపాదన పెట్టారు. కానీ ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టత రాలేదు. కర్నాటక ఎన్నికల తరువాత ఒక నిర్ణయానికి వద్దామని బీజేపీ నేతలు దాట వేసినట్టు తెలుస్తోంది.
ఆది నుంచి పవన్ అంటే విముఖతే..
ఇప్పటికే పవన్ ఏపీతో పాటు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఏపీ వరకూ కొంత సానుకూలత ఉన్నా.. తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలు పవన్ అంటే ఆసక్తి చూపడం లేదు. తొలుత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ పోటీ చేయాలని భావించినా బీజేపీ నిలువరించింది. అటు తరువాత ఏ ఎన్నికల్లో కూడా పవన్ సహకారం బీజేపీ తీసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో సైతం తెలంగాణలో ఒంటరిగా వెళదామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఎక్కడా పవన్ జనసేన విషయం ప్రస్తావించడం లేదు. అయితే పవన్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఆది నుంచి వ్యతిరేకత భావనతో ఉన్నారు. పవన్ బీఆర్ఎస్ అధినేతలతో సఖ్యతగా మెలుగుతుండడమే అందుకు కారణం.

ఆ స్పందన ఏదీ?
ఏపీలో వైసీపీ సర్కారు విపక్షాలను అణచివేసే కార్యక్రమాలపై పవన్ స్పందిస్తున్నారు. విపక్ష నేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం, కుప్పంలో అరాచకాలు సృష్టించడం వంటి సమయంలో పవన్ రియాక్టయ్యారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పేపర్ లీకేజీ ఆరోపణలతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పవన్ నుంచి ఎటువంటి రిప్లయ్ రాలేదు. తనపై తెలంగాణ బీజేపీ నేతలు వ్యతిరేక భావనతో ఉన్నందునే పవన్ స్పందించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మొన్నటికి మొన్న వరంగల్ నిట్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్ ఇదే అంశంపై స్పందిస్తారని ఆశించినా. ఆయన కనీస ప్రకటన చేయలేదు.
లైట్ తీసుకుంటున్నది అందుకే…
ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు సైతం పవన్ కు దూరమైనట్టు పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయినా సరే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పవన్ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిశారు. కొన్ని కీలక ప్రతిపాదనలను వారి ముందు పెట్టారు. వాటికి సానుకూలత రాకపోతే తన దారిన తాను వెళతారన్న ప్రచారం ఉంది. అందుకే బీజేపీ వ్యవహారాలపై పెద్దగా స్పందించకూడదని డిసైడ్ అయినట్టున్నారు. అందునా తనను పట్టించుకోని తెలంగాణా నేతల విషయాన్ని కూడా లైట్ గా తీసుకున్నట్టున్నారు. రాబోయే రోజుల్లో పవన్ తీసుకునే రాజకీయ నిర్ణయంపైనే జనసేన, బీజేపీ బంధం, భవితవ్యం ఆధారపడి ఉంది.