Pawan Kalyan: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే భారీగా టిడిపి శ్రేణులు విజయనగరం జిల్లా పోలిపల్లికి చేరుకున్నాయి. దాదాపు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరు కానున్నారు. అయితే చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సడన్ నిర్ణయంతో టిడిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అటు జనసేనలో అయోమయం నెలకొంది.
లోకేష్ పాదయాత్ర ఈనెల 18న ముగిసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర విజయవంతం అయినందుకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్ హాజరుకారని తొలుత ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు స్వయంగా వెళ్లిఆహ్వానించడంతో సభకు హాజరుకానున్నట్లు పవన్ ప్రకటించారు. ఒకే వేదికపై చంద్రబాబుతో పాటు పవన్ కనిపించనుండడంతో రెండు పార్టీల శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించాయి. అయితే ఇప్పుడు పవన్ సభకు హాజరు కావడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో రెండు పార్టీల శ్రేణుల ఆశలు నీరుగారిపోయాయి.
వాస్తవానికి సభకు హాజరయ్యేందుకు పవన్ హైదరాబాదు నుండి మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నిన్నటి నుంచి పవన్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అస్వస్థత కారణంగా సభకు హాజరు కావడం అనుమానమే. కానీ ఇప్పటికే పవన్ విజయవాడ నుంచి బయలుదేరారని.. ఆలస్యంగా నైనా సభ వద్దకు చేరుకుంటారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పవన్ వస్తుండడంతో జనసేన శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్లాయి. మరి పవన్ హాజరవుతారా? లేదా?అన్నది చూడాలి.