Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో భూకబ్జాలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ దురాగాతాలకు అంతే లేకుండా పోతోంది. సామాన్యులపైనే దాడులకు తెగబడుతూ నిత్యం ఏదో ఒక చోట కబ్జా చేస్తున్నారు. ఫలితంగా వారు లబోదిబోమంటున్నారు. సొంత పార్టీ నేతలే ఇలా వ్యవహరిస్తుంటే ఎవరికి చెప్పుకునేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. రోజురోజుకు వారి ఆకృత్యాలు భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కబ్జాకేది కాదనర్హం అన్నట్లుగా కబ్జాకోరులు అడుగడుగునా కనిపించడం దారుణం.

పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన జనవాణి కార్యక్రమం ద్వారా వేలాది మంది తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ భూమికి రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచే చేను మేస్తే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. పేదల భూమిని కావాలనే కబ్జాలకు పాల్పడుతూ వారిని నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ విధానాలపై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా రేణికుంట మండలం కరకంబాడి పంచాయతీ ఎంపీటీసీ భూ కబ్జాపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అక్కడ 2004లో ప్లాట్ నెంబర్ 2400లో తిరుపతి అర్బన్ మండలానికి చెందిన కొందరు లబ్ధిదారులకు 989 ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. కానీ వాటిని తహసీల్లార్ రద్దు చేశారు. అందులో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన 2400 ప్లాట్ నెంబర్ కూడా ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. పవన్ కల్యాణ్ వివరాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తుతున్నారు.