
ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకి ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే… అయితే ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిచారు. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలగా ఇవ్వాలని పవన్ అన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం వివాదాలకు దారితీస్తోందన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములనే పేదలకు ఇవ్వాలన్నారు. ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు జగన్ సర్కార్ పట్టాలివ్వాలని చూడటం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమేనని విమర్శించారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని భూములకూ పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది. పేదల భూములు, అసైన్ మెంట్ భూముల జోలికి వెళ్లే అవకాశం లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించినా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అసైన్‌మెంట్, ప్రభుత్వ పోరంబోకు భూములను సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురుచూస్తోన్న పేదల భూములను దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేస్తుండటం గమనార్హం. కోర్టు తీర్పులను పెడచెవిన పెట్టి, భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.