Pawan Kalyan On Volunteers: ఏపీలో వలంటీరు వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చరచ్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లతో పాటు వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు మహిళలు, వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కు నోటీసులిచ్చింది. పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సూచించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే పవన్ మరోసారి వలంటీరు వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెందుకు ఆ కామెంట్స్ చేసింది? వలంటీరు వ్యవస్థ మూలాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలు, దుష్ఫరిణామాలు వంటివి స్పష్టంగా వివరించారు. ఏలూరులో జరిగిన పార్టీ మీటింగ్ లో కీలక ప్రసంగం చేశారు. వివరణ ఇస్తూనే ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు.
వలంటీరు వ్యవస్థను ఒక భయంకరమైన వ్యవస్థతో పవన్ పోల్చారు. రూ.5 వేలు ఇచ్చి ఎవరి ఇంట్లో పడితే వారింట్లో దూరేందుకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే పవన్ వ్యాఖ్యలను ఒకసారి విశ్లేషించుకుందాం. ఒక గ్రామంలో ఉండే యువకుడు పక్క వీధిలో కనిపిస్తే అనుమానంగా ప్రశ్నిస్తారు. ఇక్కడికి ఎందుకొచ్చావని ఆరాతీస్తారు. కానీ వలంటీరు విషయంలో అలా కాదు. ఏ ఇంటికైనా, ఏ సమయంలోనైనా వెళ్లొచ్చు. ఏ వివరాలైనా సేకరించవచ్చు. అడగడానికి ఎవరూ సాహసించరు. సంక్షేమ పథకాలు, పౌరసేవలు వారితో ముడిపడి ఉండడమే అందుకు కారణం.
ప్రభుత్వ శాఖలు ఉన్నప్పుడు సమాంతరంగా రాజకీయ వ్యవస్థ ఎందుకని పవన్ ప్రశ్నించారు. దీనిపై విశ్లేషిస్తే.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెబుతున్నారు. అదే నిజమైతే వారికి విలువైన సమాచారం ఎందుకు సేకరిస్తున్నట్టు? ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. వారిపై వివాదాలు ముసురుకునే సమయంలో మాత్రం వారిని సేవకులుగా మాత్రమే పరిగణిస్తున్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ వంటి బలమైన వ్యవస్థలు ఉన్నాయి. వాటి ద్వారా పనిచేసుకోకుండా సమాంతర రాజకీయ వ్యవస్థలో భాగంగానే వలంటీర్లు పుట్టుకొచ్చారు. వారి నియామకం, వారితో పనిచేసుకోవడం రాజకీయ దురుద్దేశ్యం కాదా?
వలంటీర్ల పొట్టకొట్టడం తన ఉద్దేశ్యం కాదని పవన్ చెప్పుకొచ్చారు. వంద పండ్లలో ఒక పండు కుళ్లినా మొత్తం పండ్లు కుళ్లిపోతాయన్నారు. వలంటీరు వ్యవస్థకు కూడా అది వర్తిస్తుందని చెప్పారు. ఎంతో మంది విద్యాధికులు సైతం జగన్ చట్రంలో ఇరుక్కున్నారని.. రూ.5 వేలకు ఊడిగం చేస్తున్నారని పవన్ గుర్తుచేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, వీఆర్వోలు వంటి బలమైన వ్యవస్థ ఉండగా.. బెదిరించే వలంటీరు వ్యవస్థ ఎందుకని మాత్రమే తాను ప్రశ్నించినట్టు పవన్ వివరణ ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థను సరిగ్గా చూడకుంటే మాత్రం భవిష్యత్ లో ఒక ఐఎఎస్ వ్యవస్థలా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఏపీలో 29 వేల మంది యువతులు అదృశ్యమయ్యారని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థ ఎన్స్సీఆర్బీ చెబుతోంది. వారిచ్చిన పక్కా సమాచారంతోనే నేను మాట్లాడుతున్నాను. అందులో సగం మంది ఇళ్లకు చేరారని.. మిగతా సగం మంది ఆచూకీ తెలియదన్నారు. దీనికి కారణాలు అడిగితే ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యవస్థే కారణమంటూ అక్కడి అధికారులు చెప్పడంతో షాక్ కు గురయ్యానని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు, ఒంటరి మహిళల కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాజీ సీఎం సతీమణిని దూషించినా.. వీర మహిళలను తిడితే వారే స్పందించకూడదని.. రాష్ట్రం మొత్తం ప్రతిఘటించాల్సిన అవసరముందన్నారు. ఎన్నికలలోపు అన్ని వ్యవస్థలను మార్చుదామని.. ఒకప్పుడు సరస్వతి నిలయంగా ఉండే పులివెందుల ఫ్యాక్షన్ చరిత్రగా మార్చారని.. దానిని మళ్లీ సరస్వతి నిలయంగా మారుద్దామని పవన్ పిలుపునిచ్చారు.