Pawan Kalyan : తాడేపల్లి.. ఇప్పటికే ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిది. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణ నదీ తీరంలో హత్యలు, అత్యాచారాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్రాలో ఆడపిల్లల భద్రతపై నీలినీడలు కమ్మేలా చేశాయి. వైసీపీ మంత్రుల బాధ్యతారాహిత్య మాటలు చిచ్చు రేపాయి. సీఎం జగన్ నివాసముండే ప్రాంతంలోనే ఇలా జరిగితే ఇక రాష్ట్రమంతటా శాంతిభద్రతల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది.
తాజాగా సీఎం జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో అంధ యువతి హత్య కలకలం రేపింది. అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని బెదిరించినందుకు అతడు గంజాయి తాగి వచ్చి మరీ ఆ యువతిని హతమార్చడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా? అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని పవన్ ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేదని విమర్శించారు. తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే .. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఓ అంధ యువతి దారుణ హత్యకు గురైంది. గంజాయి మత్తులో యువుడు ఈ దాడి చేసి చంపాడు. నిన్న రాజు అనే యువకుడు ఈ అంధ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు స్థానికులు రాజును మందలించారు. కక్ష పెంచుకున్న రాజు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అది సీఎం నివాసానికి సమీపంలోనే సాగుతున్నా జగన్ పట్టించుకోకపోవడంపై పవన్ కళ్యాణ్ నిలదీశారు.