
Pawan Kalyan On Chandrababu: ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏడాదికి ముందే ఎన్నికల ఫీవర్ నెలకొంది. ప్రజాసంక్షేమ పథకాలతో అధికార పార్టీ, ప్రజల మధ్య ఉండి మద్దతు పొందేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలో వాటి మధ్య మాటల వార్ నడుస్తోంది. తాజాగా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనకు వెళుతున్న చంద్రబాబును పోలీసులు అడ్డగించారు. దీంతో ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన సభా స్థలికి చంద్రబాబు వెళ్లాల్సి వచ్చింది. ఆనపర్తిలో అడుగడుగునా పోలీసులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమబాట పట్టింది. తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ సర్కారుకు ప్రశ్నల అస్త్రాలను సంధించారు.
ప్రధాన ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం నిరంకుశ చర్యగా పవన్ అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం, భావప్రకటన స్వేచ్ఛ వంటి వాటి అర్ధాలు తెలియవన్నారు. రాజ్యాంగ విలువలపై ఏమాత్రం గౌరవం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన గొంతును వినిపిస్తున్న ప్రతిపక్షాలను నియంత్రించడమే పాలన అనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలు నిరంకుశ పోకడలను తెలియజేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నారని పవన్ మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు రహదారులపై బైఠాయించి నిరసన తెలపడం చూశామని.. కానీ చంద్రబాబు అనపర్తి పర్యటనలో పోలీసులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలపడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సభలను అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో దిగజారుడు చర్యలకు దించడం దారుణమన్నారు. పోలీసులు సభకు ముందుగా ఎందుకు అనుమతిచ్చారని.. తరువాత ఎందుకు అనుమతులు వద్దనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీని వెనుక వైసీపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.

ఈ సందర్భంగా తన పర్యటనలను అడ్డుకున్న విషయాన్ని పవన్ గుర్తుచేశారు. విశాఖలో జనవాణి కార్యక్రమానికి వెళ్లే సమయంలో అడ్డుకున్నారని.. కవ్వింపు చర్యలకు దిగారని.. చివరకు హోటల్ గదిలో నిర్బంధించారని.. వీధి లైట్లు ఆపేసి చికాకుపెట్టి న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటం ఘటనలో కనీసం రోడ్డుపై నడవకుండా చేసిన వైనాన్ని గుర్తుచేసుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు గొంతుకు విప్పుతున్నప్రతిపక్షాల చర్యలను ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది అంతే పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవుపలికారు. లేకపోతే ప్రజా గుణపాఠం తప్పదని హెచ్చరించారు.