Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రచార పర్వంలోకి దిగాయి. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు దర్శనమిస్తున్నాయి. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో సైతం ప్రకటనలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను.. ‘గాజు గ్లాసు’ తీసుకుందనే విషయాన్ని ఈ యాప్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
గత ఎన్నికల్లో జగన్ చాలా రకాల హామీ ఇచ్చారు. వన్ చాన్స్ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఫ్యాన్ గుర్తు ఉన్న వైసిపి 2019లో అధికారంలోకి వచ్చిందని సింబాలిక్ గా తెలిసేలా ఫ్యాన్ స్విచ్ ఆన్ అవుతుంది. ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి. అమరావతి, ఇసుక పాలసీ, రాష్ట్ర అభివృద్ధి.. ఇలా పేపర్ల పై రాసిఉంటాయి. వైసిపి పాలనలో ఈ అంశాల్లో రాష్ట్ర అభివృద్ధి దారుణంగా దెబ్బతింది అనే చెప్పే ప్రయత్నం చేశారు.
కనిపించి కనిపించకుండా ఉండే పవన్ కళ్యాణ్ ఆ గదిలోకి ఎంటర్ అవుతారు. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి.. చెల్లా చెదురుగా పడిపోయిన పేపర్లను ఒక్కొక్కటిగా తీసి టేబుల్ మీద సర్దుతారు. ఆపై ఆ పేపర్ల మీద గాజు గ్లాసుఉంచుతారు. అంటే వైయస్ జగన్ ను అధికారం నుంచి దూరం చేసి..రాష్ట్ర అభివృద్ధిని తాము చక్కదిద్దుతామని విషయాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే టేబుల్ మీద జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ తో పాటుగా టిడిపి సైకిల్, బిజెపి కమలం గుర్తులు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక వీడియోలో ఆఖరిలో సీఎం కూర్చొని పట్టుకుని పవన్ పక్కన నిలబడతారు. సీఎం సీటులో ఎవరు కూర్చున్నా తాను అండగా నిలబడతానని అర్థం వచ్చేలా.. పవన్ చెప్పే ప్రయత్నం చేశారు. చివర్లో పొత్తు గెలవాలి.. ప్రభుత్వం మారాలి అనే నినాదంతో మోడీ, పవన్, చంద్రబాబు ఫోటోలు కనిపించేలా చూపించారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. పవన్ సన్నిహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాడ్ కు దర్శకత్వం వహించినట్లు ప్రచారం జరుగుతోంది.