Pawan Kalyan On Secularism: ఈ దేశంలో సెక్యూలరిజాన్ని అపహాస్యం చేసింది ఎవరూ అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం ఉదారవాదులు, కమ్యూనిస్టులు అని సమాధానం వస్తుంది. ఈ దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది ఎవరూ అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం కూడా అదే. ఈ దేశంలో తీవ్రవాద ఇస్లాం పై మెతకవైఖరి వహించేది ఎవరూ అని ప్రశ్నవేసుకుంటే వచ్చే సమాధానం కూడా అదే. ఈ పాపం మూట కట్టుకుంది సెక్యూలరిస్టులుగా ముద్రవేసుకున్న ఈ అవకాశవాదులే. ఇది అక్షరాలా సత్యం.
దీనికి సాక్ష్యాలు కోకొల్లలు. షాబానో కేసు నుంచి ముమ్మూరు తలాక్ వరకూ, సల్మాన్ రష్దీ పుస్తక నిషేధం నుంచి తస్లీమా నస్రీన్ పై ఆంక్షల వరకూ అన్నింటిలో అవకాశవాదమే. అంతెందుకు ఆంధ్రాలో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల నుంచి రామతీర్ధం లో రాముడి తలనరకటం వరకూ మౌనవ్రతమే. అలాగే జేరూసలెం యాత్రలనుంచి మసీదు ముల్లాలకు ప్రభుత్వ డబ్బులు వెచ్చించటం వరకూ నోరు కట్టేసుకుని ఉండటమూ నిత్యకృత్యమే. అదే హిందూ దేవాలయాల విషయంలో ప్రభుత్వ అతి జోక్యం, అదేసమయంలో మసీదు, చర్చీలలో అసలు జోక్యం చేసుకోకపోవడం ఇవీ సెక్కులరిజం లో భాగమే. ఈ వివక్షనే ప్రజలు బీజేపీ కి దగ్గరకావటానికి కారణమయ్యింది.
Also Read: YCP To Janasena : వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు.. ఇదే ఊపు కంటిన్యూ అవుతుందా?
భావ స్వేచ్ఛ కి సంకెళ్లు వేయటానికి , సర్టిఫికెట్ ఇవ్వటానికి అసలు వీళ్ళెవ్వరు ? అనాదికాలంనుంచి భారతీయ సంస్కృతిలో భావస్వేచ్చ అంతర్భాగంగా , అంతర్లీనంగా వుంది. ఆధునిక ప్రజాస్వామ్యంతో మిగతా ప్రాంతాల్లో వచ్చిందేమోగానీ భారత్ లో ఇది ప్రజలు నాగరికతలో భాగంగా పాటించారు. వేదాన్ని తిరస్కరించిన జైనులు, యజ్ఞ యాగాదుల్ని నిరసించిన బౌద్ధులు, అసలు దైవత్వాన్నే ఒప్పుకోని చార్వాకుడు పూర్తి భావ స్వేచ్చని అనుభవించారు. వీళ్ళ వాదనలు గ్రంధాల్లో లిఖించబడ్డాయి. ఆరోజులేని నిర్బంధం ఈరోజు ఎందుకు? సల్మాన్ రష్దీ అయినా , తస్లిమా నస్రీన్ అయినా, నుపుర్ శర్మ అయినా గౌరీ లంకేశ్ అయినా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోగలగటం మన భారతీయ సంప్రదాయం. దైవదూషణ భారత్ లో నేరం కాదు. అది హిందూ మతమైనా, ఇస్లాం మతమయినా, ఇంకే మతమయినా సూక్ష్మ పరిశీలనకు అతీతం కాదు. నా ఆలోచనలు నా హక్కు. ఇది భావ స్వేచ్ఛ అంటే. అదే ఇంకో మతస్థుల్ని రెచ్చగొట్టి మాట్లాడినా, మతంపేరుతో తిట్టినా అది ముమ్మాటికీ తప్పు, నేరం. అంతేకాని మతాన్ని సూక్ష్మ పరిశీలన చేయటం నేరమెలా అవుతుంది. హిందూ మతంపై , ఆచారాలపై ఎన్నో విమర్శనాత్మక గ్రంధాలు వెలువడ్డాయి. అది నేరంగా పరిగణించలేదు. భారతీయ సంస్కృతిలో ఇది భాగం. దానికి విరుద్ధంగా గౌరీ లంకేశ్ ని, దభోల్కర్ ని చంపటం నేరం. ఇదే సూత్రం అన్ని మతాలకి వర్తిస్తుంది. ఈ విధానం అనాదిగా వేల సంవత్సరాలనుండీ భారత్ పాటిస్తుంది. ఇదే అసలు సిసలైన సెక్కులరిజం. దీనిపై అవకాశవాద వైఖరిని ఇప్పటికైనా సెక్యూలరిస్టులు, కమ్యూనిస్టులు విడనాడాలి. హిందూ మతంపై ఓ విధానాన్ని , మిగతా మతాలపై ఇంకో విధానాన్ని అనుసరించటం పచ్చి అవకాశవాద రాజకీయం. దీన్నే ఓటుబ్యాంక్ రాజకీయమనికూడా అంటారు.
పవన్ కళ్యాణ్ నిన్న, మొన్న వాళ్ళ పార్టీ సమావేశాల్లో దీన్ని ప్రస్తావించటం ముదావహం. ఇంతవరకూ ఏ రాజకీయపార్టీ ( బీజేపీ మినహాయించి) ఈ సమస్యపై ఇంత స్పష్టంగా మాట్లాడలేదు. బీజేపీ కూడా తనదైన స్టైల్ లోనే స్పందిస్తుంది. ఇతరమతాలపై మాట్లాడిన స్థాయిలో హిందూ అతివాదులపై మాట్లాడదు. కారణం అందరకూ తెలిసిందే. పవన్ కళ్యాణ్ హిందువులపై జరుగుతున్న అన్యాయాల్ని మొహమాటంలేకుండా ఏకరువుపెట్టాడు. దేశ విభజన సమయంలో పడ్డ వర్ణనాతీత ఘోరాల దగ్గరనుంచి జోగినాథ్ మండల్ ఉదంతం వరకూ పాత చరిత్రను తడిమి జరిగిన అన్యాయాన్ని ఒక్కసారి గుర్తుచేశాడు. అలాగే రామతీర్ధం సంఘటనని కూడా గుర్తుచేశాడు. నిజాలు మాట్లాడితే ఓట్లు రావనుకుంటే ఓట్లు పోయినా పర్వాలేదు నిజాలే మాట్లాడాలని కార్యకర్తలకు ఉపదేశించాడు. అదేసమయంలో ఇతర మతస్థుల విశ్వాశాల్ని గౌరవించాలని కూడా పిలుపునిచ్చాడు. సెక్యూలరిజంపై ఇంత నిక్కచ్చిగా మాట్లాడిన రాజకీయవేత్తని ఇటీవలకాలంలో తెలుగు గడ్డ మీద చూడలేదు. నాకయితే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యూల్ మాక్రోన్ గుర్తొచ్చాడు. ఎందుకంటే నిజమైన సెక్యూలరిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్న సమాంతర రాజకీయ నాయకుడు ఎవరైనా వున్నారంటే అది తనే . సెక్కులరిజం బతికిబట్టగట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రతిరాష్ట్రంలో రావాల్సిన అవసరం ఎంతయినా వుంది. అవకాశవాద , ఓటుబ్యాంకు రాజకీయాలకి స్వస్తి చెప్పినప్పుడే ఈ దేశం ఒకటిగా ముందుకు సాగుతుంది. ప్రజలందరూ ఒకటేననే భావన బలపడుతుంది. మతప్రస్తావనలేని సామాజిక పరివర్తన రావాలి. మతం వారి వారి వ్యక్తిగత జీవనంలోనే భాగంగా ఉండాలి. అప్పుడే ఈ దేశం పురోభివృద్ధి చెందుతుంది. హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ .
Also Read:National Anthem: తెలంగాణలో రేపు నిమిషం పాటు రెడ్ సిగ్నల్.. అందరూ ఆగిపోవాల్సిందే!