Pawan Kalyan- Jagan: జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పొలిటికల్ పంచ్ లు పేలుస్తున్నారు. పదునైన మాటలతో అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కౌలురైతు భరోసా యాత్రలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో పాలనా ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో సామాన్యుడికి భరోసా కరువవుతోందన్నారు. ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూడా అన్నారు. అందుకు తానే ఉదాహరణ అన్నారు. తన సినిమాలకు అడ్డంకులు సృష్టించిన విషయాన్ని గుర్తుచేశారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న మెగాస్టార్ ను సైతం అగౌరవపరిచారని..అవమానించారని విమర్శలు గుప్పించారు. కుల రాజకీయాలు చేస్తున్నారని..రాజకీయ లబ్ధి పొందేందుకు కుల,మత రాజకీయాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా మండిపడ్డారు. తాను ఎప్పుడు కులమతాల గురించి ఆలోచించనన్నారు.కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నమవుతుందన్నారు. రాయలసీమలో ఉన్న 11 శాతం మాదిగలు..8 శాతం మంది ఉన్న మాలల గురించి పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. తాను కుల మతాల నుంచి దాటి వచ్చిన మనిషినని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు కొంత అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. అన్న ఆదరించలేదని చెల్లి రాజకీయ పార్టీ పెట్టిందంటూ పరోక్షంగా సీఎం జగన్ సోదరి షర్మిళ గురించి పవన్ ప్రస్తావించారు.

సీఎం జగన్ లక్ష్యంగా..
సీఎం జగన్ టార్గెట్ చేస్తూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ తనపై కక్ష ప్రదర్శించారని చెప్పారు. భీమ్లానాయక్ సినిమా రిలీజ్ సమయంలో సృష్టించిన అడ్డంకులను గుర్తుచేశారు. ఆస్తులు, అధికారాలు ఉంటాయి..పోతాయి..కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోలేమన్నారు. సంస్కారం లేని వ్యక్తికి నమస్కారం పెట్టలేక భీమ్లానాయక్ సినిమాను వదిలేసినట్టు చెప్పారు. అయినా తాను తలచుకుంటే జాతీయ స్థాయిలో పంచాయితీ పెట్టి అన్ని సెటిల్ చేసుకునేవాడినని..కానీ నా మనసు అంగీకరించలేదన్నారు. మెగాస్టార్ చిరంజీవిలాంటి వ్యక్తులనే జగన్ కనికరించలేదన్నారు. కోట్లాది మంది అభిమానులున్న ఆయనతోనే వంగి వంగి దండాలు పెట్టించుకున్నారని మండిపడ్డారు. చిరంజీవిని చేతులు కట్టుకుని తమ ముందు నిలబడేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాల్సిన వ్యక్తిని కనీస గౌరవం ఇవ్వలేదని కూడా మండిపడ్డారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టని కుసంస్కారం మీది అంటూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయిని హత్యచేసిన వారిని ఇంతవరకూ ఎందుకు పట్టుకోలేదన్నారు. నాడు కోడికత్తితో దాడిచేస్తే ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారని.. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరేకదా.. ఇప్పటికీ నమ్మకం కుదరలేదా అని ఎద్దేవా చేశారు.

పీఆర్పీ విలీనం కాకుంటే..
ప్రజారాజ్యాన్ని నాడు కాంగ్రెస్ లో విలీనం చేయకపోయి ఉంటే రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రులే నాడు పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో కీలక పాత్ర వహించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నాటి ప్రజారాజ్యం పాత్రనే నేడు జనసేన తీసుకుందన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పోరాడుతుందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే కౌైలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు.వారికి కనీసం గుర్తింపు కార్డులు అందించడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. పద్యం పుట్టిన రాయలసీమలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని.. వైసీపీ సర్కారు ఇంటింటికీ చీప్ లిక్కర్ అందిస్తోందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి ఎక్కడ అని ప్రశ్నించారు. రాయలసీమలో వెనుకబడిన వారిని తలెత్తుకునే లా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు.