Pawan Kalyan- Godavari Districts: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనైనా… అవశేష ఏపీలో అయినా పొలిటికల్ గా ఉభయ గోదావరి జిల్లాలదే కీ రోల్. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెడతాయి. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అటు ప్రభుత్వానికి సైతం ఇదే విషయాన్ని నిఘా వర్గాలు చేరవేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ దూకుడు పెంచారు. ఆ రెండు జిల్లాల్లో పట్టు పెంచుకునేందు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బలమైన క్యాండిడేట్లను బరిలో దించడానికి ప్రయత్నిస్తున్నారు.అటు ఆ రెండు జిల్లాల్లో జనసేన తరుపున పోటీచేసేందుకు చాలామంది నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార పార్టీ నేతలు సైతం జనసేనలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇప్పటికే విశాఖ ఎపిసోడ్ తదనంతర పరిణామాలు, అటు ఇప్పటంలో పవన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచాయి. పవన్ సంధించిన విమర్శలపై కౌంటర్ ఇవ్వకుండా తమకు అలవాటైన వ్యక్తిగత దూషణకు వైసీపీ నేతలు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ గోదావరి జిల్లాల పర్యటనలో ప్రభుత్వంపై ఎటువంటి ప్రతిదాడి చేస్తారోనని రాజకీయ వర్గాల్లోసైతం ఒకరకమైన చర్చ నడుస్తోంది. రాష్ట్రమంతా ఒక ఎత్తు.. ఉభయ గోదావరి జిల్లాల మరో ఎత్తు అన్నట్టుంది జనసేన పరిస్థితి. ఇక్కడ జనసేనతో పాటు పవన్ కు హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఎక్కువ. జనసేన ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడితే ఈ రెండు జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలుపుతారు. అంతలా ఉంటుంది ఇక్కడి పరిస్థితి.

అటువంటి ఉభయగోదావరి జిల్లాలో పవన్ అడుగు పెడుతున్నారంటే జన సైనికులకు, ఫ్యాన్స్ కు పండుగే. తెగ సందడి చేస్తారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్థులపై పార్టీ శ్రేణులకు పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అటు పొత్తులపై కూడా సంకేతాలు ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అటు కీలక నేతల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉంది. అయితే పవన్ నుంచి ప్రభుత్వంపై లోతైన విమర్శనాస్త్రాలను అభిమానులు ఆశిస్తున్నారు. మరోసారి కేక పుట్టించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అధికారపార్టీ కవ్వింపులు, దాడులు, కేసులతో విసిగిపోయిన ఉభయ గోదావరి జిల్లాల పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా పవన్ ప్రసంగాలుంటాయని జనసేన నేతలు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సింహం అడుగుపెట్టబోతోంది. ఇక కాచుకోండి అంటూ జన సైనికులు సోషల్ మీడియాలో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేయడం కనిపిస్తోంది.