Pawan Kalyan: యుద్ధానికి పవన్ ఎప్పుడో సిద్ధం

పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలపై ఇప్పటికే పవన్ కు చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు.. ఎవరెవరిని బరిలో దించితే మంచిది.. అభ్యర్థుల ఎంపిక..

Written By: Dharma, Updated On : December 26, 2023 10:43 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపి కోసం వెయిట్ చేస్తోంది. అయితే బిజెపి నుంచి స్పష్టత రావడం లేదు. కేవలం జనసేనతో మాత్రమే కలిసేందుకు ఆ పార్టీ మొగ్గు చూపుతోంది. 2029 ఎన్నికల గణాంకాలను చూపుతూ జనసేన ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే పవన్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లేందుకు మాత్రమే సిద్ధమయ్యారు. బిజెపి చెబుతున్న లెక్కలను పరిగణలోకి తీసుకోవడం లేదు.

టిడిపి తో పొత్తుల విషయంలో పవన్ క్లారిటీగా ఉన్నారు. ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా టిడిపి తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు. పొత్తులకు విఘాతం కలిగేలా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా.. అటువంటి నాయకులను వైసీపీకి కోవర్టులుగా పరిగణిస్తానని హెచ్చరించారు. ఇటీవల సీఎం పదవి విషయంలో లోకేష్ క్లారిటీగా చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రమే సీఎం గా ఉంటారని తేల్చి చెప్పారు. దీనిపై కాపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినా.. హరి రామ జోగయ్య లాంటి నేతలు అగ్గిమీద గుగ్గిలం అయినా పవన్ పెద్దగా స్పందించలేదు. అయితే ఆయనకు ఇప్పటికే రాజకీయాలపై ఒక క్లారిటీ ఉందని .. ఇప్పుడు గాని తప్పటడుగులు వేస్తే జనసేన పార్టీ మిగలదని పవన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబు డైరెక్షన్లో మాత్రమే పని చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలపై ఇప్పటికే పవన్ కు చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు.. ఎవరెవరిని బరిలో దించితే మంచిది.. అభ్యర్థుల ఎంపిక.. వీటన్నింటిపై చంద్రబాబు పవన్ కు ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందించారని.. అందుకే పవన్ వెనక్కి తగ్గడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేనకు కేటాయించే కీలక మంత్రిత్వ శాఖలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారని సైతం తెలుస్తోంది. అందుకే పవన్ ఎటువంటి మూడో ఆలోచనకు తావు లేకుండా.. చంద్రబాబుకు సహకరించేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఇప్పుడు గానీ ఓట్లు, సీట్లు పెంచుకోకుంటే జనసేన పార్టీని నిర్వీర్యం చేస్తారన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. అందుకే పొత్తు ద్వారా 15 నుంచి 20 స్థానాలు సాధించుకొని శాసనసభ పక్ష నేతగా ఉండాలని పవన్ భావిస్తున్నారు.

అయితే బిజెపి ఆలోచన వేరేలా ఉంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింటుందని… అదే జరిగితే టిడిపి స్థానాన్ని తాము దక్కించుకోవచ్చు అని పవన్ కు నూరిపోస్తోంది. అయితే పవన్ మాత్రం దీనిని విశ్వసించడం లేదు. ఇప్పుడు గానీ జగన్ ఓడిపోతే వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన అవుతుందని.. ఆ పార్టీ నేతలు చేరితే 2029 ఎన్నికల నాటికి ఒంటరి పోరాటానికి దిగవచ్చని పవన్ ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు కంటే జగన్ డేంజర్ అని.. ఆ పార్టీ యాక్టివ్ గా ఉంటే జనసేన బలోపేతం అసాధ్యమని భావిస్తున్నారు. అందుకే బిజెపి ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ఆరు నూరైనా తెలుగుదేశం పార్టీతో కొనసాగడానికి సిద్ధపడుతున్నారు.