Pawan Kalyan: పవన్ కు మెగా ఫ్యామిలీ బాహటంగానే మద్దతు తెలుపుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. పవన్ కు అండగా ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జనసేన లో యాక్టివ్ గా పని చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు పవన్ కు అండగా నిలుస్తామని మాత్రమే చెప్పారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ పవన్ కు మద్దతుగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇది వ్యూహమా? లేకుంటే యాదృశ్చికంగా జరుగుతోందా? అన్నది మాత్రం తెలియడం లేదు. అయితే తాజా పరిణామాలు మాత్రం జనసైనికుల్లో ఆనందం నింపుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మృదుస్వభావి. తనపై విమర్శలు చేసిన వారిని సైతం క్షమించగల గుణం ఉన్న వ్యక్తి. తనకు రాజకీయాలు సెట్ కావంటూ సినిమా రంగం పైనే ఫోకస్ పెంచారు. తన మా నాన తాను సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే వైసిపి నాయకులు దానిని అలుసుగా తీసుకున్నారు. పవన్ దూకుడును కళ్లెం వేయడానికి చిరంజీవి పేరును వాడుకున్నారు. పవన్ రాజకీయ చర్యలు చిరంజీవికి ఇష్టం లేదని ప్రచారం చేశారు. తాజాగా పవన్ తీసుకున్న పొత్తుల నిర్ణయాలు సైతం చిరంజీవికి ఇష్టం లేదన్నట్టు చెప్పుకొచ్చారు. చిరంజీవి వైసీపీ మనిషిగా చూపేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయితే ఏనాడూ వీటిని చిరంజీవి ఖండించలేదు. కానీ వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో రెండు నిమిషాల పాటు మాట్లాడి వైసిపి ప్రయత్నాలను తిప్పి కొట్టారు. తాను పవన్ కి సోదరుడన్న విషయాన్ని వైసిపి నేతలకు గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. చిరంజీవి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ ఊహించని వైసీపీ నేతలకు.. షాక్ తగిలింది. చిరంజీవి మద్దతు పవన్ కళ్యాణ్ కేనని స్పష్టమైంది.
అటు పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తెరపైకి వచ్చారు. పవన్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ చెప్పారు. తన సపోర్ట్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కే అని తేల్చి చెప్పారు. గత ఎన్నికల ముందు రేణు దేశాయ్ని అడ్డం పెట్టుకొని వైసిపి ఎన్ని రాజకీయాలు చేయాలో అన్నీ చేసింది. ఇప్పుడు కూడా పవన్ వైవాహిక జీవితాన్ని పలుచన చేయాలని ప్రయత్నించింది. ఆయన మూడు పెళ్లిళ్లపై సినిమా తీయడానికి ఒక అడుగు ముందుకేసింది. అయితే ఈ వివాదం పై తాజాగా రేణు దేశాయ్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ లో తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. పవన్ ఔన్నత్యాన్ని,ఆశయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో వైసిపి నేతలు నీరు గారి పోయారు. ఈ ఆరోపణలతో పవన్ ను చులకన చేయాలని చూశారో.. వాటినే రేణు దేశాయ్ తిప్పుకొట్టారు. పైగా తన పొలిటికల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్కే అని తేల్చి చెప్పారు. దీంతో వైసిపి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
సరిగ్గా ఎన్నికలకు ముందు మెగా ఫ్యామిలీ ఏకతాటి పైకి రావడం విశేషం. రాష్ట్రంలో మిగతా రాజకీయ పక్షాలకు కుటుంబ మద్దతు ఉంది. కుటుంబ సభ్యులు బాహటంగానే ఆ పార్టీలకు పని చేస్తున్నారు. పవన్ మాత్రం ఒక్కరే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కుంభస్థలం లాంటి మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలంతా సపోర్ట్ చేస్తుండడం కొండంత అండగా భావిస్తున్నారు. అయితే ఇది అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు.