ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ విస్తరిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో తన ఓటు బ్యాంకు మెరుగుపరుచుకుని సత్తా చాటుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగిందని తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలపై విమర్శలు చేస్తోంది. ఈ మేరకు అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీ ఆగడాలపై పెదవి విప్పారు. రాష్ర్టంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలను బెదిరించినా వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదని చెప్పారు. భవిష్యత్ లో కూడా పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఎవరికి భయపడమని పేర్కొన్నారు.
ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన ప్రస్థానం నేడు దశదిశలా వ్యాపిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో 1200 స్థానాల్లో పోటీ చేసి 177 చోట్ల విజయం సాధించడం గొప్ప విషయమే. నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. ఈ విజయంతో రాష్ర్టంలో ఇక తమ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే ధీమా వారిలో వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అండతో అధికారులు వారి కనుసన్నల్లోనే పని చేయడం దారుణం. దీంతో పార్టీ నేతలు కాస్త అసౌకర్యానికి గురైనా విజయం సాధించడంలో మాత్రం ఎక్కడ కూడా వెనుకంజ వేయకపోవడం సమంజసమే.
రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. దాడులు, బెదిరింపులతో వైసీపీ నేతల దౌర్జన్యాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్ ఆకృత్యాలను అడ్డుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమేనని జనసేన ప్రకటించింది. ఈనెల 27,28 తేదీల్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ సర్కారు అరాచకాలపై పోరాడేందుకు వ్యూహరచన చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికల్లో 24 శాతం ఓట్లు సాధించగా పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ఓటింగ్ బ్యాంకు పెరుగుతోంది. పరిషత్ ఎన్నికల్లో మార్పునకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు. ఈ విజయంతో పార్టీని సముచిత స్థానంలో నిలపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీని అన్ని రంగాల్లో ముందుకు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.