
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో కరోనా బారిన పడిన పవన్.. చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. కోలుకున్నప్పటికీ.. ఇంటికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా సెట్ అయ్యేంత వరకు విశ్రాంతి తీసుకున్న పవన్.. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ రాబోతున్నారు జనసేనాని.
ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోనున్న పవన్.. రేపటి నుంచి పొలిటికల్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. బుధవారం నుంచి నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఆ సమావేశం తర్వాత నిరుద్యోగ యువతతో సమావేశం అవుతారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న తర్వాత.. దీనిపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తారని తెలుస్తోంది. అనంతరం భవన నిర్మాణ కార్మికులతోనూ పవన్ సమావేశం నిర్వహిస్తారట.
ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై పార్టీ దృష్టిపెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై యువతలో నిరసన వ్యక్తమవుతోంది. గ్రూప్స్ పోస్టులు కేవలం 33 ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. దీనిపై పార్టీపరంగా జనసేన ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్ లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేసింది.
ఈ విషయంలో పోరాటం సాగించేందుకు పార్టీ శ్రేణులకు ఒక రోడ్ మ్యాప్ కూడా పవన్ అందిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు మరిన్ని అంశాలపైనా ప్రభుత్వం యుద్ధం ప్రకటించబోతున్నారు పవన్. గడిచిన మూడు నెలల్లో ప్రజల నుంచి ఎన్నో అర్జీలు వచ్చాయట. అవన్నీ పవన్ పరిశీలించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు అంశాలను కూడా ఎంచుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి.. కరోనా తర్వాత యాక్టివ్ అయిన పవన్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రాజకీయ కదనరంగంలోకి అడుగు పెట్టబోతుండడం.. పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇస్తోంది.