Pawan Kalyan Former Look Viral: రోమ్ లో ఉంటే రోమాన్ లా ఉండాలి. అక్కడ కూడా భారతీయుడిలాగే ఉంటానంటే కుదరదు. ఇప్పుడు ఏ సమస్యనైనా జనంలోకి తీసుకెళ్లాలంటే ముందుగా నేతలు వారితో మమేకం కావాలి. వారిలా మారాలి. అప్పుడే వారి సమస్యలు తెలుస్తాయి. ప్రజల్లోనూ విశ్వసనీయత ఏర్పడుతుంది. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు. కోనసీమ క్రాప్ హాలీడేపై పవన్ కళ్యాణ్ ఆవేదన వెలిబుచ్చారు. వైసీపీ ప్రభుత్వం చర్యల వల్ల రైతులు పంట విరామం ప్రకటించడాన్ని ఆక్షేపించారు. రైతుల పక్షాన పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రైతులా మారి వారికి సంకేతమైన కండువాను భుజాన వేసుకొని అచ్చం రైతులా పవన్ కళ్యాణ్ కనిపించారు.
రైతుల బాధను ఒక రైతులాగే విడమరిచి చెప్పి.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి పవన్ తీసుకెళ్లారు. అన్నదాతల ఆక్రందనను కళ్లకు గట్టారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందని జనసేనాని విమర్శించారు.. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని… కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు. ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుంది. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమని రైతుల బాధలు కళ్లకు కట్టారు.
తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాయడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయి. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని ఏపీ రైతాంగం దుస్థితిని పవన్ కళ్యాణ్ ప్రజల ముందు పెట్టారు.
రైతుల సమస్యలను రైతులాగే మారి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం విశేషం. అచ్చం రైతు గెటప్ లో పవన్ కనిపించడం అందరినీ అలరించింది. సమస్యల విషయంలో పవన్ కళ్యాణ్ నిబద్ధతకు ఇది నిదర్శనమంటున్నారు. రైతుల నిరసనలు, ఆందోళనలు సహా రైతు వేదికలపై అందరూ వేసుకునే పచ్చటి కండువాను పవన్ వేసుకొని కోనసీమ రైతుల ఆవేదనను ఎలుగెత్తి చాటాడు. పవన్ కళ్యాణ్ ‘రైతు గెటప్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.