Pawan Kalyan Focus On Uttarandhra: ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఉత్తరాంధ్ర చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకునే వారికి ఉత్తరాంధ్ర కీలకం. అందుకే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. మూడు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను…జగన్ సర్కారు ఆరు జిల్లాలుగా విటగొట్టింది. గత ఎన్నికల్లో ప్రజలను వర్గాలుగా విడగొట్టి వైసీపీ లబ్ధి పొందింది. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసింది. ముందుకుగా జిల్లాలను విడగొట్టింది. తరువాత విశాఖ రాజధానిగా చేసి ఉత్తరాంధ్రలో వైట్ వాష్ విజయాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే అది వర్కవుట్ అయ్యేలా లేదు. అలాగని టీడీపీ కూడా ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. ప్రజల్లోకి దూకుడుగా వెళ్లడంలో ఆ పార్టీనేతలు చతికిలపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పవన్ ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే కాపులు, తూర్పుకాపులు మద్దతుదారులుగా ఉండగా.. మిగిలిన బీసీ వర్గాలను ఆకర్షించుకోగలిగితే ఉత్తరాంధ్రపై పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఆ బాధ్యతను పార్టీ నేత నాదేండ్ల మనోహర్ కు అప్పగించారు. ప్రస్తుతం మనోహర్ ఉత్తరాంధ్రలో పర్యటించి పార్టీని ఫోకస్ చేసే పనిలో పడ్డారు.

గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో టీడీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. నగరంలో పట్టు సాధించిన ఆ పార్టీ రూరల్ కు వచ్చేసరికి మాత్రం ఫెయిలైంది. విజయనగరంలో తొమ్మిది స్థానాల్లో ఓటమి చవిచూసింది. శ్రీకాకుళం జిల్లాలో చచ్చీచెడి రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా 8 స్థానాలను చేజార్చుకుంది. అంత జగన్ ప్రభంజనంలో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయని సరిపెట్టకుంది. పూర్వ వైభవానికి నానా తంటాలు పడుతూ వస్తోంది. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి టీడీపీని డిఫెన్స్ లో పడేశారు. ఎలా ముందుకెళ్లాలో తెలియక టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామక్రిష్ణ బాబు వంటి వారు తప్ప.. మిగతా నాయకులు ముఖం చాటేస్తున్నారు. ఇంకా మైనస్ పాయింట్లలోనే టీడీపీ కొనసాగుతోంది.
అటు వైసీపీ సైతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉత్తరాంధ్రలో విలువైన సంపదను వైసీపీ నేతలు దోచుకుంటున్నారన్న ప్రచారం మరింతగా ఊపందుకుంది. పైగా ఇతర ప్రాంతాల నేతల పెత్తనం ఎక్కువైందన్న ఆరోపణ ఉంది. అది సొంత పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదన్న టాక్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేంరెడ్డి వంటి వారిపై అవినీతి ఆరోపణలు రావడం.. వందలాది ఎకరాలను దోచుకున్నారని వార్తలు గుప్పుమనడంతో ఉత్తరాంధ్ర ప్రజలు.. ముఖ్యంగా విశాఖ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అటు ధర్మాన ప్రసాదరావులాంటి ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రిపై సైతం భూదందా ఆరోపణలు వచ్చాయి. అందుకే వైసీపీ సర్కారు మూడు రాజధానులను తెరపైకి తెచ్చినా.. కీలకమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖ కు ప్రకటించినా స్థానిక ప్రజలు మాత్రం ఆహ్వానించలేదు.. అలాగని వ్యతిరేకించలేదు. వైసీపీ నేతలు భారీ సభలు, సమావేశాలు, చివరకు ర్యాలీలు నిర్వహించినా పెద్దగా పార్టిస్పేట్ చేయలేదు.

ఇటువంటి తరుణంలో పవన్ పక్కా స్కెచ్ వేశారు. ఉత్తరాంధ్రలో సామాజికవర్గపరంగా కాపులు, తూర్పుకాపులు అధికం. ప్రస్తుతం వీరంతా జనసేనకు ఫేవర్ గా ఉన్నారు. వీరిని మరింత దగ్గర చేసుకునేందుకు ఫోకస్ పెంచారు. మిగతా బీసీ కులాలు ఎక్కువగా టీడీపీతో ఉన్నాయి. వెలమ, మత్స్యకార సామాజికవర్గాల్లో టీడీపీ సానుభూతిపరులు ఎక్కువ. వారిని తనవైపు టర్న్ చేసేందుకు పవన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలకు విఘాతంకలిగించే వాటిపై పవన్ పోరాటం చేశారు. మత్స్యకార సదస్సును సైతం ఏర్పాటుచేశారు. ఇప్పుడు వారిని సమన్వయం చేసే బాధ్యతను పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ కు అప్పగించారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడి పార్టీ స్థితిగతులను అధ్యయనం చేస్తున్నారు. శ్రీకాకుళంలో కూడా ఆయన పర్యటన ఉంటుందని జనసేనవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే గట్టి వ్యూహంతోనే పవన్ పావులు కదుపుతున్నట్టున్నారు.