Pawan Kalyan ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. అంతేకాదు.. వారిపై కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే అయినా స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిచేస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణను తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పక్కన ఉండేవాళ్లు అర్ధరాత్రి ఫోన్లు చేసి మాన మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడడం ఏం పద్ధతి అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సదురు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలిపారని.. ఈ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.
ఈ విషయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రాయపాటి అరుణకు అండగా నిలిచారు. ఈ ఘటన విషయంలో ధైర్యంగా ఉండాలని అరుణకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

రాయపాటి అరుణను వేధించిన ఘటనను ప్రసారం చేసిన మహాటీవీ, 99 టీవీ చానెళ్లపై కేసులు నమోదు చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు.
ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేసేది ఒక్కటేనని.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటామని.. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదని పవన్ హితవు పలికారు. మహాటీవీ, 99 టీవీ చానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని సమస్యకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.