Pawan Kalyan : అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఎవ్వరూ హర్షించరు. మన నోట్లోకి నాలుగు ముద్దలు వెళుతున్నాయంటే అది అన్నదాత చలవే.. అయితే రోగాలు, రొప్పులకు ఆ అన్నదాత ఆగమాగం అవుతున్నాడు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయి. అందుకే రాష్ట్రంలోని కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ‘కౌలు రైతు భరోసా యాత్ర’ను చేపట్టారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను కలిసి పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు.
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు శ్రీ మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. అతని భార్య శ్రీమతి అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరించి ఓదార్చారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలకు మా వంతు అండగా నిలబడాలన్న లక్ష్యంతో రైతు భరోసా యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ బ్యాచ్ తనను చంద్రబాబు దత్తపుత్రుడు అనడంపై కౌంటర్ ఇచ్చాడు. ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో ఉన్న జగన్, ఆయన బృందం తనకు నీతులు చెప్పడం ఏంటని నిలదీశారు. జగన్ ను సీబీఐ దత్తపుత్రుడు అంటామని హెచ్చరించారు. తెలుగుదేశం బీటీం అని జనసేనను అంటే.. వైసీపీని చర్లపల్లి షటిల్ టీం అంటామని తేల్చిచెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ మాటలు అనాలని సూచించారు. ప్రజల పక్షాన మేం పాలసీలు మాట్లాడుతుంటే వైసీపీ అగ్రనాయకత్వం వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరుణ్, పార్టీ రాయలసీమ నేత శ్రీ రాందాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
-పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటనలో బాధితులను ఓదార్చిన ఫొటోల దృశ్యమాలిక