స్థానిక ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పక్షం విచ్చలవిడిగా దౌర్జన్యకాండకు పాల్పడటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్ పట్టించుకొనక పోవడం, అనేక చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకొని పలుచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుపుకోవడం పట్ల జనసేన, బీజేపీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలో క్షీణిస్తున్న పరిస్థితులు బీహార్ ను తలపిస్తున్నాయని మండి పడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర పరిస్థితులపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. రాజకీయాలను నేరమయం కావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
”151 సభ్యులుండి వీరెందుకు భయపడుతున్నారో.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరించేటప్పుడు రాష్ట్ర న్నికలు ఎందుకు పెట్టాలి ? ” అని పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కొంతమంది పోలీసులు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
భయపెట్టి సాధించుకునే గెలుపు ఎప్పుడూ నిలబడదన్నారు. దౌర్జన్యాలకు, బెదిరింపులకు లొంగకుండా ఏకగ్రీవం కోసమే అయితే ఇసి ఎందుకు.. ఎన్నికల తంతు ఎందుకు.. అని పవన్ ప్రశ్నించారు. 13 జిల్లాలోనూ ఇంత హింసను ఎన్నడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
నియంతృత్వానికి తోడు ఫ్యాక్షనిజం తోడైందని కన్నా మండిపడ్డాయిరు. మండలాఫీసుల నుండి పోలీసుల సహకారంతో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లడం, చింపేయడం, చివరికి ఆర్‌ఒ ల వద్ద కూడా నామినేషన్ల కాగితాలను చింపేయడం .. తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిగా చూడటం అని విస్మయం వ్యక్తం చేశారు.
ఏకగ్రీవాల కోసం వైసిపి దాడులకు పాల్పడుతోందని కన్నా విమర్శించారు. వైసిపి దాడుల్ని తప్పించుకొని నామినేషన్లు వేస్తే స్క్రూటినీలో తీసేస్తున్నారని, పోలీసులు కొందరు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
చిత్తూరులో బిజెపి నేతలపై దాడులు చేశారని తెలిపారు. దుర్గి ఎస్సై రౌడీలా వ్యవహరించారని విమర్శించారు. ఎలక్షన్ కమీషన్ పరిధిలో ఉన్న అధికారాన్ని కూడా ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.