Pawan Kalyan CM candidate: ఆంధ్ర రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి నడిపించాలని కేంద్రంలోని బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ రూట్ మ్యాప్ గురించి పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో హింట్ ఇచ్చాడు. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నట్టు ప్రకటించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా త్వరలోనే రూట్ మ్యాప్ ఖరారు చేయబోతున్నామని తెలిపారు.
ఈ క్రమంలోనే 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ-జనసేన అడుగులు వేస్తోంది. ఈ రెండు పార్టీలు పొత్తులో భాగంగా ఏపీలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్-సోము వీర్రాజు కలిసినా.. కిందనున్న కేడర్ మాత్రం కలిసి ప్రచారం చేయడం లేదు. ఎన్నికల్లో పాల్గొనడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అపారంగా ఉన్న జనసేన కార్యకర్తలు, అభిమానులను బీజేపీతో ఏకం చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం.
Also Read: Telangana Govt- Salaries: మోడీ దెబ్బకు.. తెలంగాణ దివాళా.. ఈనెల జీతాలివ్వడం కష్టమేనా?
వచ్చేనెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలోనే రూప్ మ్యాప్ ను ప్రకటించబోతున్నారని.. పవన్ కళ్యాణ్ ను జనసేన-బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. 2024 లక్ష్యంగా బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిసింది.
ఈ రూట్ మ్యాప్ తర్వాత.. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఖరారు అయ్యాక ఇక జనసేన-బీజేపీ రెండు పార్టీలు కలిసి బహిరంగ సభలు, నిరసనలు, ప్రజల్లోకి వెళ్లే సందర్భాల్లో ఒక్కటిగా వెళ్లనున్నాయి. కేంద్రంలోని పెద్దలు వీరికి అండదండలు అందిస్తూ ఈ సభలకు హాజరు కానున్నారు. జనసేన ఇన్నాళ్లు బీజేపీతో అంటీముట్టనట్టు ఉంటూ ఒంటరిగానే రాజకీయం చేస్తోంది. ఇక నుంచి బీజేపీతో కలిసి మాత్రమే వీరిద్దరి రాజకీయం సాగనుంది.
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా టీడీపీతోనూ పొత్తుకు ఆసక్తి చూపిస్తున్నారన్న అనుమానాలు బీజేపీలో ఉన్నాయి. అందుకే ముందుగానే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీని ఈ అస్త్రంతో అడ్డుకోవచ్చని బీజేపీ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. జనసేనకు ప్రాధాన్యం ఇచ్చి టీడీపీని దూరంగా పెట్టే ఎత్తుగడను బీజేపీ అమలు చేస్తోంది. టీడీపీ తమ కూటమిలోకి రావాలంటే పవన్ కళ్యాన్ ను సీఎం అభ్యర్థిగా ఓకే అంటేనే చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ సై అంటుంది. లేదంటే నై అంటుంది. ఇలా జనసేనతోనే సాగే వీలు బీజేపీకి కలుగుతుంది.
ఇక ఏపీలో బలం దృష్ట్యా బీజేపీకి అంతగా లేదు. జనసేనకు యువత, కార్యకర్తల బలం ఉంది. ఇప్పుడు పొత్తుతో బీజేపీకి అనూహ్యంగా బలం పెరుగుతుంది. పవన్ నుంచి విడిపోతే బీజేపీ ఒంటరిగా పోటీచేయడం కష్టం. అందుకే పవన్ నే ముందుపెట్టి రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోంది.
పవన్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి ఉమ్మడిగా సాగితే అటు అధికార వైసీపీ.. ఇటు ప్రతిపక్ష టీడీపీకి గట్టి పోటీనివ్వచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందని.. సీఎం క్యాండిడేట్ గా పవన్ ను ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఈ రూట్ మ్యాప్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Also Read:Emergency in India- Modi: ఎమర్జెన్సీ కాలంలో సర్దారుగా అవతారమెత్తిన ప్రధాని మోదీ