Pawan Kalyan-Chandrababu: తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ముగింపునకు సంబంధించి విజయోత్సవ వేడుకలకు జనసేన అధినేత పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నడవాల్సి ఉంది. కానీ మధ్యలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో దాదాపు రెండు నెలలకు పైగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ప్రారంభించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ ను కుదించారు. గ్రేటర్ విశాఖ శివాజీ నగర్ లో నేడు లోకేష్ యాత్రను ముగించనున్నారు.
పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో ఈనెల 20న నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నాయి. దాదాపు 8 రైళ్లలో టిడిపి శ్రేణులు తరలివస్తున్నట్లు సమాచారం. కార్యక్రమ నిర్వహణకు గాను టిడిపి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. పొత్తు నేపథ్యంలో జనసేన శ్రేణులు సైతం హాజరుకానున్నాయి.అందుకు తగ్గ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఈ సభ పై భారీ అంచనాలు ఉన్నాయి.
తొలిసారిగా యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొనున్నారు. భారీ బహిరంగ సభలో తొలిసారిగా ఆ ఇద్దరు నేతలు హాజరుకానున్నారు. ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కీలక ప్రకటన దిశగా అడుగులు వేయనున్నారు. తొలుత ఈ సభకు పవన్ కు ఆహ్వానం అందినా.. ముందస్తు కార్యక్రమాలతో హాజరు కాలేనని ప్రకటించారు. కానీ చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో మనసు మార్చుకున్నారు. తక్కువ సమయం ఉన్నందున.. వీలైనంతవరకు ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పవన్ ఈ సభకు వస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు మిన్నంటాయి.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించాలని చంద్రబాబుతో పాటు పవన్ డిసైడ్ అయ్యారు. ఆ ఇద్దరి కాంబినేషన్లో ఏడు సభల నిర్వహణకు ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు జనసేనకు సీట్ల కేటాయింపు పూర్తయిందని.. ఈనెల 20న జరిగే భారీ బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం లేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం పాదయాత్ర ముగింపునకు సంబంధించి సభ అని.. ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ప్రకటనలు ఉంటాయని.. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల అధినేతలు ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ రాకతో యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.