Pawan Janasena:ఏపీలో జనసేన మెల్ల మెల్లగా రాజకీయంగా పట్టు సాధిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీని ఎవరూ ఆదరించకపోయినా ఆ తరువాత మూడేళ్లో జనసైనికులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. దీంతో మిగతా పార్టీల కంటే జనం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే దూకుడుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే జనసేనలో సీనియర్ నాయకులు లేకపోయినా బీజేపీతో పొత్తు ఉండడంతో లాభిస్తోందని అనుకుంటోంది. ఈ మేరకు బీజేపీతో పొత్తు విషయాన్ని పవన్ ఇప్పటికే కన్ఫామ్ చేశారు. టీడీపీ విషయం ఎన్నికల వరకు చెబుతామని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత బీజేపీ విషయంలో చేస్తున్న కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. తాము కూడా బీజేపీ బాటలోనే నడుస్తామని వపన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో పవన్ చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి చిన్న కార్యక్రమానికైనా పవన్ హాజరవుతున్నారు. దీంతో కేడర్లో మరింత ఉత్సాహం నెలకొంది. అటు ప్రజలు సైతం పవన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల రైతులకు ఆర్థిక సాయం చేసిన వపన్ పై రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం వస్తే రైతుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతామని అంటున్నారు. ఇటు రైతులే కాకుండా మహిళల సంరక్షణ కోసం తాము కృషి చేస్తామని అంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అఘాయిత్యాలను అడ్డుకోవడంతో వైసీపీ ప్రబుత్వం విఫలమైందని పలు సందర్బాల్లో పేర్కొన్నారు.
ఇందు కోసం జనసేన పార్టీలో పటిష్టమైన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన క్రీయాశీలక వీర మహిళల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జనసేన పెద్ద పార్టీగా ఆవతరిస్తుందని అన్నారు. ఏ పార్టీ అయినా ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుందని అన్నారు. బీజేపీ కూడా ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైందని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించిందని పవన్ తెలిపారు. త్వరలో బీజేపీలాగే జనసేన కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా విజయవాడలో ఆదివారం జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను సభలో స్వీకరించనున్నారు. తమ పార్టీ ప్రజాశ్రేయస్సు కోరుతుందని, అందుకే ప్రజాకార్యక్రమాలే ఎక్కువగా నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఇక డిసెంబర్ వరకు సినిమాలు పూర్తి చేసి ఆ తరువాత పవన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈలోపు జనసేన పట్టున్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోనున్నారు. తద్వారా బస్సు యాత్ర సక్సెస్ అయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
[…] […]