Pawan Kalyan- Chandrababu: ఏపీలో గత ఏడాదిన్నరగా ముందస్తు ఎన్నికల ముచ్చట నడుస్తోంది. కానీ ఎప్పటికప్పుడు జగన్ సర్కారు బ్రేకులు వేస్తూ వస్తోంది. ఒక వైపు ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుండడం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకోవడం, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పొజిషన్ లేకపోవడంతో తప్పనిసరిగా జగన్ ముందస్తుకు వెళతారని అంతా భావించారు. మొన్నటికి మొన్న ఢిల్లీ పర్యటన అందులో భాగమన్న వార్తలు వచ్చాయి. కానీ ముందస్తు ముచ్చటేమిటి లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల తేల్చేయడంతో అటువంటి ఆలోచనకు విరమించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక అంశానికి భయపడే ముందస్తుకు జగన్ మంగళం పలికారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ఏపీ రాజకీయాలను విశ్లేషించే రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిత్యం సొంత పార్టీపై సెటైరికల్ గా మాట్లాడే రాజు గారు చాలా రకాలుగా విశ్లేషించారు. అవి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో వైరల్ గా మారాయి.

కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం జీవో 1 తెచ్చిన సంగతి తెలిసిందే. రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలను నిషేధించారు. ఇప్పటికే చంద్రబాబును కుప్పంలో అడ్డుకున్నారు. విపక్ష నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. పోలీసులు అడ్డగిస్తున్నారు. ఈ జీవోపై రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు జీవో 1 చెల్లదని కూడా తేల్చేశారు. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం జీవోను కొట్టివేస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. 14 ఏళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబును అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ పోలీస్ ప్రభుత్వం పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. విపక్షాలను కట్టడి చేసేందుకే జీవో 1 జారీ అయినట్టు విమర్శల నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ కూడా అదే కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు, పవన్ భేటీపై కూడా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి భేటీతో మావారి ప్యాంట్లు తడిసిపోతున్నాయి అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. వైసీపీకి భయం లేకుంటే సాక్షిలో పతాక శీర్షికన కథనాలు ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిపోయిందన్నారు. ఈ క్షణం ఎన్నికలు జరిగినా రెండు కలిసే పోటీచేస్తాయని అభిప్రాయపడ్డారు. మా పార్టీ ముందస్తుకు వెళ్లడం లేదని కూడా తేల్చేశారు. సర్వే రిపోర్టు జగన్ కు చేరిందని.. అందుకే బ్రేక్ పడిందన్నారు. ముందస్తు కోసం ఢిల్లీ పెద్దలను కలిసినా.. క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి బాగాలేకపోవడంతో వెనక్కి తగ్గినట్టు చెప్పారు.

పవన్ పై వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలపై కూడా రఘురామ క్లారిటీ ఇచ్చారు. ప్యాకేజీ, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం పవన్ కు ఏముందని ప్రశ్నించారు. ఒక సినిమాలో నటిస్తే రూ.100 కోట్లు వచ్చే అగ్రహీరో అని.. డబ్బుల కోసం తాపత్రయపడే వ్యక్తిత్వం పవన్ ది కాదని తేల్చేశారు. టీడీపీతో పొత్తుకు పవన్ తహతహలాడుతున్నారన్న వైసీపీ విమర్శలపై ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. కేవలం పవన్ ను కాపులకు పరిమితం చేయాలన్న ఆలోచనతోనే అలా మాట్లాడుతున్నారని.. అది వర్కవుట్ కాదన్నారు. వైసీపీకి కాపులు ఎప్పుడో దూరమయ్యారని.. బీసీ, ఎస్సీల్లో కూడా ఆలోచన ప్రారంభమైందన్నారు. అందుకే అన్నీ సెట్ రైట్ చేసుకునేందుకే జగన్ ముందస్తుకు వెళ్లడం లేదని రఘురామ తనదైన రీతిలో విశ్లేషించారు.