Pawan Kalyan- BJP: పొత్తుల పై పవన్ స్పష్టతతో ఉన్నారు. బంతిని బీజేపీ కోర్టులోకి విసిరారు. 2024 కోసం తన రోడ్ మ్యాప్ తానే సిద్ధం చేసుకుంటున్నారు. తేల్చుకోవాల్సింది ఇక బీజేపీనే అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఇటీవల పవన్, చంద్రబాబు భేటీలో పొత్తుల చర్చలు జరగకపోయినా… భవిష్యత్తులో అడుగులు అటువైపే పడతాయన్న చర్చ బీజేపీలో మొదలైంది.

బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం పవన్ ఎదురు చూపులు చూశారు. ఎన్నో సార్లు బహిరంగంగా ప్రస్తావించినా బీజేపీ నుంచి స్పందన రాలేదు. పవన్ వైజాగ్ టూర్ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడు బీజేపీలో చలనం కలిగింది. వైజాగ్ పర్యటనకు వచ్చిన మోదీతో జనసేనానికి అపాయింట్ మెంట్ కుదిర్చారు. మోదీ రోడ్ మ్యాప్ ఇచ్చారు. అది కూడ టీడీపీ ప్రస్తావన లేని రోడ్ మ్యాప్. మోదీ భేటీ తర్వాత పవన్ బీజేపీతోనే వెళుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ మోదీ రోడ్ మ్యాప్ తర్వాత కూడ బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యక్రమాలు పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు అంతంత మాత్రమే.
2024 ఎన్నికల పట్ల పవన్ స్పష్టతతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడితేనే ప్రభుత్వాన్ని గద్దెదించవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో టీడీపీ లేని బీజేపీ రోడ్ మ్యాప్ అంతిమంగా వైసీపీకి లాభం చేస్తుంది. ఈ అంశం పై పవన్ క్లారిటీతో ఉన్నారు. ఇటీవల కుప్పం ఘటనతో మరోసారి చంద్రబాబు, పవన్ భేటీకి అవకాశం వచ్చింది. ఇరుపార్టీలు పొత్తుల పై మాట్లాడకున్నా.. పొత్తు పొడుస్తుందనే సంకేతాలు బలంగా వెళ్లాయి. దీంతో ఒక్కసారిగా బీజేపీలో అంతర్మథనం మొదలైంది. పవన్, చంద్రబాబు కలిస్తే బీజేపీ ఒంటరిగా అయినా వెళ్లాలి లేదా ప్రతిపక్షాలతో కలిసి వెళ్లాలన్న పరిస్థితి ఉత్పన్నమైంది.

పవన్ తన వైఖరిని చెప్పకనే చెప్పినట్టు బీజేపీ నేతలకు అర్థమవుతోంది. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ నేతలే అన్న విషయం అవగతమవుతోంది. ఒంటరి సమరమా .. ఉమ్మడి పోరాటమా ? అన్న నిర్ణయం బీజేపీ కోర్టులోనే ఉంది. భవిష్యత్తు రాజకీయాల పై పవన్ ఫుల్ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నారు.