Telangana Assembly Election: రాష్ట్రంలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. రాజకీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికార భారత రాష్ట్ర సమితి మొదలుపెడితే భారతీయ జనతా పార్టీ వరకు.. నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆరు హెలికాప్టర్లను ప్రధాన పార్టీలు వాడుతుండగా.. ప్రచారం ముగిసేనాటికి మరో 5 జతయ్యే అవకాశం కల్పిస్తోంది. గత ఎన్నికల్లో 5 హెలికాప్టర్లను వినియోగించారు. అప్పట్లో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే హెలికాప్టర్లను వాడేవారు. ఈసారి మంత్రులు, ముఖ్య నేతలు సైతం వినియోగిస్తున్నారు.. ఇప్పటికే రాష్ట్రంలోని అధికార పార్టీ రెండు హెలికాప్టర్లను రెండు నెలల పాటు అద్దెకు తీసుకుంది. కాంగ్రెస్, బిజెపి ప్రచార అవసరాలకు అనుగుణంగా రెండేసి హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నాయి.
ఉద్యమ సమయం నుంచీ కెసిఆర్ హెలికాప్టర్లలోనే సమావేశాలకు హాజరయ్యేవారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఆయన ఇలా వందకు పైగా ప్రాంతాల్లో సభలో పాల్గొన్నారు. ఈసారి కూడా అదే విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల్లో ఐదు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. మరోవైపు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, మంత్రి హరీష్ రావు కూడా హెలికాప్టర్ల ద్వారా సభలకు హాజరవుతున్నారు. ఇతర మంత్రులు, కీలక నేతలు సైతం ప్రచారంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితి ఈ సౌకర్యం కల్పించింది. నోటిఫికేషన్ తర్వాత ఇంకొకటి వినియోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బిజెపి హెలికాప్టర్లను సమకూర్చుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు.
రాష్ట్రంలో హెలికాప్టర్లను అద్దెకిచ్చే పేరు పొందిన సంస్థలు లేకపోవడంతో రాజకీయ పార్టీలు బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ లోని సంస్థలను సంప్రదించి అద్దెకు తీసుకుంటున్నాయి. సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర గంటకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు చార్జ్ చేస్తున్నారు. డబుల్ ఇంజన్ అయితే గంటకు 2.75 లక్షలు, రోజువారి అద్దెప్రాతి పరికన కావాలంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల లోపు 10 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో హెలికాప్టర్ల వినియోగానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అద్దెకు ఇచ్చే సంస్థ, పైలట్ వివరాలు కచ్చితంగా అందజేయాలి. అద్దెకు ఇచ్చే సంస్థలు లైసెన్స్ పొందినవై ఉండాలి. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతి పొందాలి. ఇతర వ్యవహారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది.. ఇక కీలకమైన నేతలు కచ్చితంగా డబుల్ ఇంజన్ హెలిక్యాప్టర్ లనే వాడాలి. హెలికాప్టర్ సంబంధించి ఏదైనా నియోజకవర్గంలో అభ్యర్థి లేకుండా ప్రచారం నిర్వహిస్తే దాని ఖర్చును పార్టీ భరించాల్సి ఉంటుంది.