
దేశంలో కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కట్టడి లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టడంలేదు. రోజుకురోజుకు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో 18వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 600మంది మృత్యువాత పడ్డారు. నిన్నటి నిన్న రాష్ట్రపతి భవన్లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం సంచలనంగా మారిన సంగతి తెల్సిందే. తాజాగా లోక్ సభలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా కరోనా సోకిన వ్యక్తి లోక్ సభలోని హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తుంటాడని అధికారులు పేర్కొన్నారు. మార్చి 23న పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డటంతో సదరు వ్యక్తి ఇంటికే పరిమితమయ్యాడు. పది రోజుల కిందట అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చూపించుకున్నాడు. అయితే అప్పుడు అతడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రాలేదు. దీంతో వైద్యులు అతడిని డిశ్చార్చి చేశారు.
తాజాగా ఈనెల 18న కరోనా లక్షణాలు కన్పించడంతో మరోసారి ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతడికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు ఉద్యోగిని క్వారంటైన్ కు తరలించారు. అతడు తన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, మనవరాలితో ఉంటున్నాడు. దీంతో వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ తొలి రెండు స్థానాల్లో నిలుస్తుంది. ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.