Pawan Kalyanపర్చూరు నియోజకవర్గ పర్యటనలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. 80 మంది కౌలు రైతులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు.
వైసీపీ నేతలకు రూ.లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు.. జనసేనకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు.. కానీ క్రిమినల్ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు ఒక రూల్.. సామాన్యులకు మరొక రూలా? అని నిలదీశారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్ల పాటు ఏం చేయలేరనే ధీమాతో ఉన్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సరిగ్గా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాలన్నారు. సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు.
-సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే తయారు చేస్తా
సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. రూ. 5 లక్షల కోట్లు అప్పు తెచ్చానని.. ఏం చేశారని వైసీపీ ఎమ్మెల్యేలను అడగండని.. రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు.
2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యాంత్రాగాన్ని వినియోగిస్తున్నారు కానీ కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు ఉపయోగపడడం లేదని విమర్శించారు.
-రైతులు, నిరుద్యోగులపై జనసేన వరాలు
నిరుద్యోగులకు పవన్ కళ్యాణ్ కీలక హామీలు ఇచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా వైసీపీ వాళ్లకు ఉన్నప్పుడు రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఉందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
-ఒక్క అవకాశం ఇవ్వండి
చాలా సార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని.. ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరడం విశేషం. బాధ్యత గల వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త తరం నాయకులు రాజకీయాల్లోకి రావాలన్నారు. ఒకసారి అందరూ జనసేన వైపు చూడాలని పిలుపునిచ్చారు.
-జనసేన ఆవేదన ఇదీ..
పార్టీ పెట్టినప్పటినుంచి జనసేనకు ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయని.. అయినా ప్రజల కోసం వెనక్కి తగ్గలేదని పవన్ కళ్యాణ్ జనసేన ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదని.. పొత్తు ప్రజలతోనే తప్ప ఇంకెవరితోనూ కాదని స్పష్టం చేశారు.
-మోడీతో విభేదించి నష్టపోయా..
ప్రజల కోసం.. ప్రత్యేక హోదా కోసం ప్రధాన మంత్రితో విభేదించి వ్యక్తిగతంగా నష్టపోయానని వపన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే నా తపన అని.. నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం అవసరం లేదన్నారు. దసరా తర్వాత వైసీపీ నేతల సంగతి చూస్తామని హెచ్చరికలు చేశారు. అప్పటి వరకూ ఏం మాట్లాడినా భరిస్తామని పవన్ అన్నారు.