Paracetamol Price: రోగమొచ్చినా.. రొప్పి వచ్చినా.. ఆఖరుకు కరోనా వచ్చినా మన సీఎం కేసీఆర్ ‘ఒక జ్వరం గోలి వేసుకుంటే పోయేదానికి ఇంత లొల్లి ఏందయ్యా’ అని అనేవారు. ఎందుకంటే జ్వరం గోలీలు అంత చీప్ గా ఇన్నాళ్లు దొరికేవి. ఒక్క పారాసిటమాల్ వేసుకుంటే కరోనా ఖతం అవుతుందని ఆ మధ్య ఏపీ సీఎం జగన్ కూడా సెలవిచ్చారు. రూ.10 కి 10 మాత్రలు వచ్చే పారాసిటమాల్ టాబ్లెట్స్ ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి.
ఇప్పటికే పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ వాటితోపాటు నిత్యావసరాలు భారీగా పెరిగిపోయాయి. వీటితోనే చస్తూ చలిజ్వరాల బారినపడుతున్న జనాలకు ఇప్పుడు ఆ జ్వరం గోలీలు కూడా మరింత ప్రియం కానున్నాయి.
Also Read: Allu Arjun Congratulated RRR Team: వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్
తాజాగా జ్వరం, బీపీ, ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి. వీటి ధరలు ఏకంగా 10.8శాతం పెరుగనున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ బాంబు పేల్చింది. అన్నింటిని పెంచేస్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే జ్వరం ఇతర గోలీల ధరలను కూడా పెంచి షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తాజాగా టోకు ధరల సూచీని సవరించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ధరలను 10.8శాతం పెంచినట్లు తెలిసింది.
అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 మందుల ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి 10.8 శాతం పెరగనున్నాయి. ఇందులో జ్వరానికి ఉపయోగించే పారాసిటమాల్ నుంచి ఇన్ఫెక్షన్, గుండె, బీపీ, చర్మవ్యాధులు, అనీమియా వంటి చికిత్సలకు ఉపయోగించే అత్యవసర ఔషధాలన్నీ భారీగా పెరుగనున్నాయి.
కరోనా వైరస్ నివారణలో ఉపయోగించే పారాసిటమాల్, అజిత్రోమైసిన్, తోపాటు ఇతర అత్యవసర ఔషధాలు ఉన్నాయి. కరోనా కారణంగా తయారీ ఖర్చులు పెరిగాయని.. అందుకే ఔషధాల ధరలను పెంచుతున్నట్లు కేంద్ర ఔషధాల ధరల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
కరోనాతో ఇప్పటికే చస్తున్న జనాలపై ఆర్థిక భారం మోపకుండా వారికి ఊరటనివ్వాల్సింది పోయి ఆఖరుకు మందుల ధరలు కూడా పెంచిన మోడీ సర్కార్ పై విమర్శల వాన కురుస్తోంది.
Also Read: CM Jagan Three Capital Issue: మూడు రాజధానులతో జగన్ మళ్లీ గెలుస్తారా?