Palle Raghunatha Reddy: మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీలో చేరనున్నారా? తెలుగుదేశం పార్టీని వీడనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు కూడా. ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి విషయంలో కూడా అలానే జరుగుతోందన్న టాక్ ప్రారంభమైంది. ఆయన వైసీపీ గూటికి చేరుతారని ప్రచారం నడుస్తోంది. రకరకాల రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో పల్లె రఘునాథ్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. ప్రస్తుతం పుట్టపర్తి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్నారు.
2014లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో మాత్రం అమాత్య పదవి కోల్పోయారు. ప్రభుత్వ విప్ పదవికి పరిమితమయ్యారు. మంత్రివర్గం నుంచి తొలగించినా పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీకి, చంద్రబాబుకు విధేయతగా పనిచేశారు. అనంతపురంలో లోకేష్ పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా నడిపించారు. అటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ ఎందుకు మారుతారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ ప్రతి జిల్లాను, ప్రతి నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
రాయలసీమలో వైసీపీది పూర్తి ఆధిపత్యం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ.. రాయలసీమలో మెజారిటీ స్థానాలు వైసిపి దక్కించుకుంది. అయితే అనంతపురంలో మాత్రం పట్టు సాధించలేకపోయింది. గత ఎన్నికల్లో ఇదే జిల్లాలో మెజారిటీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. 2024లో మాత్రం మెజారిటీ స్థానాలు టిడిపి దక్కించుకుంటుందని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆర్థిక, అంగ బలం ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి నేతలను తన వైపు తిప్పుకుంటే అనంతపురం జిల్లాలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పల్లె రఘునాథ్ రెడ్డి సీనియర్ నాయకుడు. జిల్లా వ్యాప్తంగా అనుచర గణం ఉంది. ప్రస్తుతం ఆయన పుట్టపర్తి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ తప్పకుండా సీట్ ఇస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలో సమీకరణల దృష్ట్యా మంత్రి పదవి దక్కే అవకాశం డౌటే. అందుకే వైసిపి ఆయనను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పుట్టపర్తి పక్కనే కదిరి నియోజకవర్గము ఉంది. కదిరి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డికి పోటీ చేయించి.. పుట్టపర్తి స్థానాన్ని సిట్టింగ్ వైసిపి ఎమ్మెల్యేకు విడిచి పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడు అటు కదిరి, ఇటు పుట్టపర్తి నియోజకవర్గం కైవసం చేసుకోవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి తో దశాబ్దాల బంధాన్ని విడిచిపెట్టి.. పల్లె రఘునాథ్ రెడ్డి వస్తారా? లేదా?అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.