పల్లె పల్లెన సద్దుల సంబురం

పల్లె పల్లె పూలసంద్రాలవుతాయి.. ప్రకృతి తల్లి పులకరించిపోతుంది.. అంటరాని పూలకు రాజసమొస్తుంది.. తొమ్మిది రోజుల పూల జాతర.. ఆడపడుచుల ఆటపాటలు.. ఇంటింటా.. వాడవాడా.. ఊరూరా.. తెలంగాణ అంతటా వెల్లివెరిసే తీరొక్క పూల వనం.. ఉయ్యాల పాటలు.. కోలాట ఆటలు.. ఫలహారాల ఘుమఘుమలు..  అగరుబత్తీల సువాసనలు… శనివారం సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ సంబురాలకు తెలంగాణ బిడ్డ సిద్ధమైంది. Also Read: ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్రలకు బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు బతుకమ్మ అంటే పూల సంబురం.. […]

Written By: NARESH, Updated On : October 24, 2020 1:48 pm
Follow us on

పల్లె పల్లె పూలసంద్రాలవుతాయి.. ప్రకృతి తల్లి పులకరించిపోతుంది.. అంటరాని పూలకు రాజసమొస్తుంది.. తొమ్మిది రోజుల పూల జాతర.. ఆడపడుచుల ఆటపాటలు.. ఇంటింటా.. వాడవాడా.. ఊరూరా.. తెలంగాణ అంతటా వెల్లివెరిసే తీరొక్క పూల వనం.. ఉయ్యాల పాటలు.. కోలాట ఆటలు.. ఫలహారాల ఘుమఘుమలు..  అగరుబత్తీల సువాసనలు… శనివారం సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ సంబురాలకు తెలంగాణ బిడ్డ సిద్ధమైంది.

Also Read: ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్రలకు బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు

బతుకమ్మ అంటే పూల సంబురం.. గ్రామాల్లో తెల్లతెల్లవారుతూనే పూలను సేకరించడం పెద్ద వేడుక. తంగేడు పూలు, గునుగు, కట్ట, చామంతి, బంతి, గన్నేరు.. ఇలా ఎన్నెన్నో రకాల పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చుకుని ఆడుకుంటారు. తెల్లగా ఉండే గునుగుపూలకు  వివిధ రంగులను అద్దుతారు. ఎన్ని రకాల పూలున్నా తంగేడు పూలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. పసుపు వర్ణంలో బంగారంలా మెరిసిపోతూ ఉంటాయి. పసుపు రంగును మహిళ మణులు తమ  ఐదోతనానికి సంకేతంగా భావిస్తారు.

బతుకమ్మను పేర్చడం ఓ కళ. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని బతుకమ్మ పేరుస్తారు. గుమ్మడి ఆకులను పెద్ద పల్లెంలో పరిచి, ఆ ఆకులపై పసుపు, కుంకుమలు,  అక్షింతలు చల్లి వలయంగా తంగేడు పూలను ముందుగా అమరుస్తారు. ఇలా వివిధ రంగుల పూలను ఒక వరుస మీద మరొక వరుసగా పెడుతూ గోపురంలా పేరుస్తారు. పెద్ద బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మను కూడా పేరుస్తారు. దానిపై తమలపాకు లేదా చిక్కుడు ఆకులో కాని పసుసు ముద్ద ‘గౌరమ్మ’ పెట్టి మధ్యన నొక్కి రెండు శిఖరాలుగా చేస్తారు. ఇవి శివ పార్వతులకూ, అర్థనారీశ్వర తత్వానికి ప్రతీక. వాటికి వస్త్రాలుగా పత్తితో అలంకరించి మందిరం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు.
సాయంత్రం వేళ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో ఊరంతా బతుకమ్మలను తలపై పెట్టుకుని చెరువు వద్దకు చేరుకుంటారు. మధ్యలో  పెద్ద బతుకమ్మను పెట్టి మిగతా వాటిని చుట్టూ సర్దుతారు. వయో భేదం లేకుండా మహిళలు బతుకమ్మల చుట్టూ గుండ్రంగా తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ.. బతుకమ్మ పాటలు పాడుతారు. పెళ్లికాని యువతులు ఓ గుంపుగా చేరి కోలల ఆట ఆడుతారు.  తర్వాత బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి.. గౌరమ్మను మంగళ సూత్రాలకు పూసుకుని తమ కుటుంబాలు చల్లగా ఉండాలని మొక్కకుంటారు. ఆ తర్వాత తెచ్చిన ఫలహారాలు, నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుని ఆరగిస్తారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై కొనసాగుతున్న వివాదం.. రంగంలోకి ఆదివాసీలు..!

తెలంగాణ ప్రజా జీవనంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానముంది. అలాంటి  బతుకమ్మ ఆటలో కొన్ని ఆచారాలను మార్చేస్తున్నారు కొందరు.. పూర్వ పద్ధతినే ఆచరించాలని పెద్దలు చెబుతున్నారు. బతుకమ్మ పండుగ ఆట, పాటలకు ఆధునిక పద్ధతులు రుద్దడం సరికాదంటున్నారు. డీజే సౌండ్ లతో సిన్మా పాటలు, తీన్మార్ స్టెప్పులు వేస్తూ.. సంప్రదాయానికి స్వస్తి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విదేశీయులు సైతం బతుకమ్మ ఆటకు ఆసక్తి చూపుతున్న తరుణంలో  మనవాళ్లు ఆటను పక్కదారి పట్టిస్తున్నారని పెద్దలు వాపోతున్నారు.