ఇండియాకు తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లతోపాటు ఇతర వైద్య సామగ్రిని అందించేందుకు సిద్ధమైంది పాకిస్తాన్. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషి ట్విటర్ ద్వారా ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం నిన్న భారత్ కు సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.
‘‘కరోనా సెకండ్ వేవ్ పై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. పొరుగు దేశం సహా ఇతర దేశాలు కూడా ఈ మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ మహమ్మారిపై ప్రపంచం కలిసికట్టుగా యుద్ధం చేయాల్సి ఉంది’’ ఇమ్రాన్ ట్వీట్ చేశారు.
తాజాగా మంత్రి ఖురేషీ ట్వీట్ చేశారు. ‘‘కొవిడ్ రెండో దశ విజృంభణపై పోరాటం చేస్తున్న భారత్ కు మద్దతు తెలుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా వంతు సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి తక్షణమే భారత్‌కు అందేలా ఇరు దేశాలకు చెందిన అధికారులు కృషి చేయాలి. అంతేకాకుండా.. కరోనాపై పోరులో సాయానికి ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషించాలి’’ అని ఖురేషీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇలాంటి కష్టకాలంలో విభేదాలు పక్కనపెట్టి సహకారం అందించేందుకు ముందుకు రావడంపై పాక్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనాతోపాటు అన్ని విషయాల్లోనూ కలిసి కట్టుగా ముందుకు సాగి, సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.