Tanot Mata Temple: పాకిస్తాన్ మనదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సరిహద్దుల్లో బాంబులు వేసింది. మనదేశంలో మత కల్లోలాలు సృష్టించింది. నకిలీ కరెన్సీ రూపొందించి మన ఆర్థిక రంగాన్ని నాశనం చేయాలని భావించింది. అంతర్జాతీయ ముఠాలతో చేతులు కలిపి.. విధ్వంసానికి పాల్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది. అయినప్పటికీ భారత్ నిలబడింది. ప్రపంచ వేదికల మీద స్థిరంగా ఉండగలిగింది. అందువల్లే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా భారత్ అవతరించింది. కేవలం ఉగ్రవాదాన్ని.. పైశాచికత్వాన్ని మాత్రమే నమ్ముకున్న పాకిస్తాన్.. అట్టడుగున ఉండిపోయింది.
ఈరోజుకు పాకిస్తాన్ దేశంలో సరైన సదుపాయాలు లేవు. రోడ్ల నుంచి మొదలు పెడితే తాగునీటి వరకు ప్రతి విషయంలోనూ వెనుకబడే ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మనదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఓ గుడి మీద దాదాపు 3,000 వరకు బాంబులు వేసింది. జై సల్మీర్ సరిహద్దుల్లో పురాతన తనోట్ మాతా దేవాలయాన్ని నేలమట్టం చేయాలని భావించింది. ఇక్కడ ఎన్నో రకాల విధ్వంసాలకు పాల్పడింది. ఇంత జరిగినప్పటికీ ఈ ఆలయం చెక్కుచెదరలేదు. పాకిస్తాన్ ఈ స్థాయిలో దాడులు చేయడానికి ప్రధాన కారణం ఒకటుంది.
ఈ ఆలయాన్ని భారత సైనికులు తమ ఇలవేల్పులాగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని థార్ వైష్ణో దేవి అని పిలుస్తుంటారు. ఈ ఆలయ నిర్వహణను భారత సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు స్వయంగా చూసుకుంటారు. పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా సరే ఈ ఆలయం స్థిరంగా నిలబడిందని.. వైష్ణో దేవి అమ్మవారు దేశాన్ని కాపాడే శక్తి అని ఇక్కడ సైనికులు పేర్కొంటారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. 1965 కాలంలో పాకిస్తాన్ ఈ ఆలయం పై 3000 బాంబుల వరకు వేసింది. ఎప్పటికీ ఆలయం ఏమీ కాలేదు. అంతేకాదు ఒక బాంబు కూడా పేలలేదు. నాడు పాకిస్తాన్ వదిలిన ఆ బాంబులను మ్యూజియంలో భద్రపరిచారు.
భారత సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలో ఉన్నప్పటికీ.. ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తుంటారు. నవరాత్రి నుంచి మొదలు పెడితే అనేక ఉత్సవాల వరకు ఇక్కడ వేడుకలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని విదేశీ యాత్రికులు కూడా సందర్శిస్తుంటారు. కాకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పూర్తిగా పరిశీలించిన తర్వాతే వారిని ఆలయ సందర్శనకు పంపిస్తుంటారు.