Padma Awards 2022: ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంటర్నెట్ ను నడిపించేది ఇద్దరు భారతీయులు కావడం మనకు గర్వకారణం.. అమెరికా సంస్థలైనా వాటిని తమ మేధస్సుతో అగ్రగామి సంస్థలు వారిద్దరూ తీర్చిదిద్దారు. ఇప్పుడు వాటికి సీఈవోలుగా ఎదిగారు. అంతటి గొప్ప వారిని సన్మానించుకోవడం నిజంగానే మనకు దక్కిన అవకాశం. ఆ అవకాశాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ అందిపుచ్చుకుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలకు దేశ అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేసింది. మరి వారిద్దరూ ఎవరు? ఎక్కడి వారు? ఎలా ఎదిగారన్న దానిపై స్పెషల్ ఫోకస్..
పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించే వారిని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులతో ప్రతీ సంవత్సరం సత్కరిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అవార్డులను ప్రకటించింది. నలుగురు పద్మవిభూషన్, 17 మంది పద్మ భూషన్, 107 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. కళా రంగంతో పాటు రాజకీయ, రక్షణ, సాఫ్ట్ వేర్ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని ఈ సంవత్సరం ఎంపిక చేయడం విశేషం. వీరిలో ముఖ్యంగా ఇండియాకు చెందిన ఎన్నారైలు సత్యం నాదెళ్ల, సుందర్ పిచాయ్ లను పద్మభూషన్ తో కేంద్రం గౌరవించింది. ప్రపంచంలోనే అత్యున్నత టేకీ సంస్థలైన మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యం నాదెళ్ల… గూగుల్ సీఈవోగా సుందర్ పిశాయ్ లు ఈ ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన వీరు ప్రపంప ప్రఖ్యాత చెందిన సంస్థలను ముందుకు తీసుకెళ్లడంతో సఫలీకృతులవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని కేంద్రం పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. కాగా ఈ ఇద్దరు దక్షిణ భారతదేశానికి చెందిన వారు కావడం విశేషం.
-సత్య నాదెళ్ల ప్రస్థానం..
మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్యం నాదేళ్ల తెలుగువారే. రాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురం లోని ఎల్లనూరు మండలం బుక్కాపురం ఆయన స్వగ్రామం. తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. తల్లి ఉపాధ్యాయురాలు. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత 1967లో హైదరాబాద్ వచ్చిన యుగంధర్ దంపతులకు సత్యనారాయణ నాదెళ్ల (సత్యం నాదెళ్ల) ఇదే సంవత్సరం ఆగస్టు 19వ తేదీన జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. సత్యం నాదెళ్లకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. జట్టు సభ్యులను సమన్వయం చేయడం ఆయన ఇక్కడి నుంచే నేర్చుకున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. 2013లో జరిగిన పాఠశాల 90 వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఆ తరువాత కర్ణాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఇక ఇంజనీరింగ్ పట్టా తీసుకొని సత్యం అమెరికా పయనమయ్యారు. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ చేశాడు. ఆ తరువాత కొంతకాలం మైక్రో సిస్టమ్స్ లో పనిచేసిన తరువాత 1992లో మైక్రో సాఫ్ట్ లో అడుగుపెట్టాడు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలో 9 వేల కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరించిన సమర్థవంతంగా విధులు నిర్వహించారు. మైక్రోసాప్ట్ ప్రధాన ప్రాజెక్టు క్లౌడ్ కంప్యూటింగ్ ను అప్పట్లో ముందుండి నడిపించారు. పరిశోధన, అభివృద్ధి విభాగం వైస్ ప్రెసిడెంట్ గా సత్యం నాదెళ్ల పనిచేశారు. ఇలాగే దూసుకుపోతూ 20014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. అలాగే 2021లో సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
-గూగుల్ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్థానం..
ఇంటర్నెట్ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ పై అపార నమ్మకం ఉంది. అలాంటి సంస్థకు భారతీయుడు సీఈవోగా ఉన్నారు. ఆయనే సుందర్ పిచాయ్. ఈయన అసలు పేరు సుందర్ రాజన్ పిచాయ్ కాగా అమెరికాకు వెళ్లిన తరువాత పేరు మార్చుకున్నారు. 1972 జూలై 12న సుందర్ మద్రాసులో జన్మించాడు. ఆ తరువాత ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు పూర్తిచూసిన సుందర్ పించాయ్ ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. అనంతరం 1993లో అమెరికా వెళ్లిన ఆయన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్ లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు.
సుందర్ పిచాయ్ తొలుత మెక్ కిన్సే అండ్ కో సంస్థలో మెటీరియల్స్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తరువాత 2004లో గూగుల్ లో చేశారు. ఇందులో తన ప్రతిభను చూపిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. 2015 ఆగస్టు 10న గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2017లో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సుందర్ పిచాయ్ కు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ‘టైమ్స్’ ప్రకటించే 100 మంది ప్రముఖుల జాబితాలో సుందర్ పిచాయ్ కు రెండుసార్లు చోటు దక్కింది.
ఇలా భారత్ లో పుట్టిన ఇద్దరు మేధావులు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజాలను నడిపించడం దేశానికే గర్వకారణంగా చెప్పొచ్చు. అలాంటి వారిని ‘పద్మ’ అవార్డులతో గౌరవించి కేంద్రం సరైన పనే చేసింది.